KTR News: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని కేటీఆర్ మండిపాటు
GHMC Councel Meeting | జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ నేతల అరెస్ట్‌పై కేటీఆర్ మండిపడ్డారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే బడ్జెట్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బడ్జెట్‌పై ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా యత్నించడంతో కౌన్సిల్ సమావేశంలో రసాభాసగా సాగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీ కార్పొరేటర్ల నిరసన
మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పలువురు కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్‌ఎంసీ కార్యాలయంకు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. తమ డివిజన్లకు నిధులు కేటాయించటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమ డివిజన్లను నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు.
నగరాభివృద్ధిని పట్టించుకోవడం లేదు
బీఆర్ఎస్ కార్పొరేటర్లు అక్కడే ఆందోళనకు దిగారు. ఎవరి ఆమోదంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసిపప్పటికీ వినలేదు. పరిస్థితులు తీవ్రతరం అవుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా?
తమ పార్టీ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు తమ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు.
నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా?
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా? గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా? పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు’ అని అన్నారు.
ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు
హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని వెల్లడించారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్‌కు బెయిల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

