Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komatireddy Venkatreddy : పీసీసీపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉపఎన్నికకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. తనను సంప్రదించకుండా కమిటీ వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Komatireddy Venkatreddy : తెలంగాణ పీసీసీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరుగుతుందంటే తానూ రాజీనామా చేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్ అన్నారు. ఉపఎన్నిక విషయంలో తనను సంప్రదించకుండానే కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపఎన్నిక విషయం ఆ కమిటీ చూసుకుంటుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు వస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నికలు వచ్చిన నియోజకవర్గానికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు.
ఉపఎన్నికకు దూరం
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తనను పిలవలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకే ఆ ఉపఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానన్నారు. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు తనకు ఎలాంటి ఆహ్వానం లేదన్నారు. పార్టీలో ఏ మీటింగ్ జరిగినా తనకు సమాచారం ఇవ్వడం లేదని వెంకటరెడ్డి తెలిపారు. సమావేశానికి రావాలని ఆహ్వానించకపోతే ఎలా వెళ్తానని ప్రశ్నించారు. చండూరులో జరిగిన బహిరంగ సభలో తనను తిట్టించారని హోం గార్డుతో పోల్చారన్నారు. దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసన్నారు.
ప్రొఫైల్ మార్చేసిన వెంకటరెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత కొన్ని రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన తన ట్విటర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ హోంగార్డు అని రాసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీని అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్ ఖాతాలో వెంకటరెడ్డి ప్రొఫైల్ లో బయో మార్పుచేశారు. కొద్ది సేపటి తర్వాత హోమ్ గార్డ్ అనేే పదాన్ని తొలగించారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలతో హర్ట్ అయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి...అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పగా, తాజాగా రేవంత్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు.
క్షమాపణలు చెప్పిన రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రేవంత్ క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరభావంతో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు అద్దంకి దయాకర్ రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చారు. అయితే ఇద్దరు నేతలు క్షమాపణలు చెప్పినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాంతించినట్లు కనిపించడంలేదు. ట్విటర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌కు హోంగార్డు అని కోమటిరెడ్డి మార్పులు చేశారు. చండూరు సభలో అద్దంకి హోంగార్డు అంటూ చేసిన విమర్శలను ఉద్దేశించి వెంకటరెడ్డి ఇలా ప్రొఫైల్ మార్చారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : క్షమాపణలు చెబితే సరిపోదు రేవంత్- శాంతించని కోమటి రెడ్డి
Also Read : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణలు