World Sparrow Day: కేబీఆర్ పార్కులో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు
పిచ్చుకలు అంతరించుపోకుండా చూడాలని పిలుపుపార్క్ గేటు ఎదుట మహిళా శక్తిని చాటే THE FLIGHT శిల్పం
పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్. కాసుబ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవవేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిన్నతనంలో పిచ్చుకలతో ఆడుకున్న రోజులు అందరికీ గుర్తేనని, ఆ మధుర స్మృతులు రానున్న తరాలకు అందించాలంటే పర్యావరణ రక్షణ అందరి కర్తవ్యం కావాలన్నారు. ప్రాధాన్యతగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం, అడవుల పునరుద్దరణ చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రకృతి పునరుజ్జీవనం చెందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. స్కూలు పిల్లల్లో అవగాహన పెంపుతో పాటు, వాకర్స్ అసోసియేషన్, స్వచ్చంద సంస్థలు పర్యావరణ హిత కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని డోబ్రియాల్ కోరారు.
ప్రభుత్వం, అటవీ శాఖ చర్యల వల్ల తెలంగాణలో అడవులు, పర్యావరణం బాగా మెరుగుపడిందని జంతు, పక్షి ప్రేమికలు అన్నారు. జంతువులు, పక్షిజాతుల సంచారం కూడా గతంతో పోల్చితే స్పష్టంగా పెరిగిందని తెలిపారు. కేబీఆర్ పార్కు బర్డ్ వాక్ లో పాల్గొన్న ఔత్సాహికులు తమ కెమెరాల్లో పలు రకాల పక్షులను వారు బంధించారు. పిచ్చుకల దినోత్సవంలో భాగంగా కేబీఆర్ పార్కులో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. బర్డ్ వాచింగ్ తో పాటు, పర్యావరణ అవగాహన, అటవీ ప్రాంతాల్లో చేయదగిన, చేయకూడని పనులు, పిట్టుగూళ్ల పంపిణీ, స్కూలు పిల్లలకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ కాంపెయిన్లను నిర్వహించి బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ బి.సైదులు, బర్డింగ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్, నేచర్ లవర్స్ సొసైటీల ప్రతినిధులు, వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి ఎం.జోజి, కేబీయార్ పార్కు సిబ్బంది, వాకర్స్ అసోసియేష్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే, ఆదివారం (మార్చి 19న) నాడు కేబీఆర్ ప్రధాన గేటు ఎదుట ఫ్లయిట్ అనే శిల్పాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆవిష్కరించారు. మహిళల ఆర్థిక వృద్ధి, భద్రత, స్వచ్ఛమైన ఆలోచనలకు ప్రతిరూపంగా ఫ్లయిట్ శిలా రూపాన్నిఏర్పాటు చేశారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నిత్యం నెమళ్లు, సీతాకోకచిలుకలు, మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్‌తో సందడిగా ఉండే కేబీఆర్ జాతీయ ఉద్యానవనం ఎదుట మహిళా శక్తిని చాటే విగ్రహం అదనపు ఆకర్షణగా నిలిచింది. నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చైర్‌పర్సన్ శుభ్రామహేశ్వరితో కలిసి ఈ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్‌తో ఎంతోకాలంగా అనుబంధం ఉందని మేయర్ విజయలక్ష్మీ గుర్తుచేశారు. భవిష్యత్‌లో ఫిక్కీలో చేరి సామాజిక కార్యక్రమాలు చేస్తానని ఆమె తెలిపారు.
కేబీఆర్ పార్కుకే మరింత అందమొచ్చేలా శిల్పాన్ని స్టెయిన్ లెస్ స్టీల్‌తో డిజైన్ చేశారు. మహిళా యోధురాలి రూపంలో ఉన్న శిల్పం వారిలో భద్రత, స్వచ్ఛమైన ఆలోచనలకు ప్రతిరూపంగా ఉందన్నారు. తెలంగాణలో మహిళాశక్తిని ప్రోత్సహించడంలో సహకరించిన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి శుభ్రా మహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.