Telangana RTC: ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకులు బాగున్నాయ్! సమ్మె వాయిదా, ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికుల ఆవేదన
Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. కానీ దశాబ్ధాలుగా వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం చూపేదెలా.. ఆర్టీసీ కార్మికులతో ABP దేశం ప్రత్యేక ఇంటర్వూ..

Telangana RTC: దాదాపు సమ్మెకు సిద్దమైన ఆర్టీసీ ప్రగతిరథ చక్రానికి తాత్కాలిక బ్రేక్ పడింది. మంత్రి పొన్నం హామీతో కార్మికులు వెనక్కు తగ్గారు. అయితే సమస్యల పరిష్కారం కోసం కాలపరిమితి విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకీ తెంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటి..? ప్రభుత్వం ఏమంటోందో తెలుసుకునే ప్రయత్నం ABP దేశం చేసింది. దీని కోసం కొంతమంది కార్మికులను ప్రత్యేక ఇంటర్వూ చేసింది.
ABP దేశం: నన్ను కోసుకుతిన్నా నా వద్ద రూపాయిలేదు. ఆర్టీసీ నుంచి వచ్చే డబ్బు ఆర్టీసీ కార్మికులకే ఖర్చుపెడుతున్నామంటూ సీఎం మాట్లడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీరెమంటారు..?
ఆర్టీసీ కార్మికులు: మా ముఖ్యమైన డిమాండ్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. 21 పేస్కేల్ అమలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా, ప్రభుత్వమే కొని ఆర్టీసికి అప్పగిస్తే మరింత లాభాలు సాధించవచ్చు. ఆర్టీసీ కార్మికులు సహచరించడం వల్లనే మహాలక్ష్మీ పథకం సక్సెస్ అయ్యింది. ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల సంస్థలకు నష్టం జరుగుతోంది. ఈ విషయంలో అనేకసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వమూ ఇంతే , ఈ ప్రభుత్వమూ అదే చేస్తోంది. హయత్‌నగర్, మియాపూర్ , హెచ్సీయూ డీపో ఇలా అనేక డిపోలు ప్రైవేటుపరం చేయడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రమే మేము అడుగుతున్నాము.
ABP దేశం: ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులా? ప్రవేటు ఉద్యోగులా?
ఆర్టీసీ కార్మికులు: ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వంలో విలీనం మధ్యలోనే ఆగింది. ఉచిత బస్సు హామీ అమలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఆర్టీసికి వస్తుందని ప్రశ్నించేవారు ఎవరూ లేరు. గత ప్రభుత్వం కాలయాపన చేసింది. గవర్నర్ గెజిట్ వచ్చాక కూడా మూలన పడేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి అలా వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా, నేటికీ విలీనం ప్రక్రియ పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలంటే ప్రభుత్వంపై భారం పడుతుంది. అందుకే విలీనం అర్థాంతరంగా ఆపేశారు. ఎప్పుడైనా చేయాల్సిందే కాబట్టి కాలయాపన చేయకుండా త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసి కార్మికులు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగులు కాకుండా మధ్యలో మిగిలిపోయాం.
ABP దేశం: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయి..?
ఆర్టీసీ కార్మికులు: గత ప్రభుత్వంలో ఆర్టీసీ యూనియన్లను రద్దు చేశారు. ఈ ప్రభుత్వం అధిాకారంలోకి రాగానే తిరిగి యూనియన్ల ఏర్పాటును స్వాగతిస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ హామీ నిలుపుకోలేదు. మేం సమ్మె నోటీసు ఇస్తే తీసుకున్నారు. యూనియన్లు స్వేచ్చను మాత్రం అడ్డుకుంటున్నారు. మేము మూడు నెలల క్రితం సమ్మె నోటీసు ఇస్తే లైట్ తీసుకున్నారు. కనీసం చర్చల ద్వారా పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వం మొండిగా వ్యహరిస్తేనే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలనే తెచ్చుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అదే బాట పడుతోంది. మేము 21 డిమాండ్‌లు లేవనెత్తితే అందులో డబ్బుతో సంబంధంలేని డిమాండ్‌లు చాలా ఉన్నాయి. కేవలం మాట ద్వారా పరిష్కరించగలిగే సమస్యలను సైతం ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తెలంగాణ ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు ముందుండి కొట్లాడాం. రాష్ట్రం ఏర్పాటుతో మా బతుకులు మారుతాయని అనుకున్నాం. కానీ జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మా జీవితాలు బాగున్నాయి.





















