RTC Strike: సమ్మె విషయంలో ఎస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగులకు TGSRTC స్వీట్ వార్నింగ్
Telangana RTC | సమ్మెబాట పట్టనున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్య స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామంటూనే, గీత దాటితే వేటు తప్పదంటూ హెచ్చరిస్తోంది.

తెలంగాణలో మే 7వ తేదీ నుండి సమ్మెకు ఆర్టీసి ఉద్యోగులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఎట్టకేలకు సమ్మె మార్గంగా ఉద్యోగులు సిద్దమైయ్యారు. తాజాగా ఉద్యోగులను ఉద్దేశించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఆర్టీసి ఉద్యోగుల సంస్ధకు చేసిన, చేస్తున్న కృషిని కొనియాడుతూనే ఆర్దిక పరిస్దితిని ఉద్యోగుల ముందుంచే ప్రయత్నం చేసింది. సహృదయంతో అర్దం చేసుకోవాలని, ఉద్యోగులకు చేయాల్సిందంతా చేస్తున్నామని చెబుతూనే గీతదాటితే ఉద్యోగాలకే ముప్పు తప్పదంటూ హెచ్చరించింది. టీజీఎస్ఆర్టీసీ విడుదల చేిసిన లేఖలో ఏముందంటే..!
ఉద్యోగుల వల్లే అభివృద్ది పథంలో ఆర్టీసీ..
క్షేత్రస్థాయిలో టీీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులంతా నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం వల్లే సంస్ద అభివృద్ధి పథంలో పయనిస్తోంది. మీరు సమిష్టి కృషితో పనిచేస్తూ బస్సుల్లో ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తోన్న ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడటం లేదు. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించడం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు..
ఆర్ధికభారం ఉన్నా.. ఆదుకుంటున్నాం..
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కూడా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్ మెంట్ తో 2024 మే నెలలో యాజమాన్యం అందించింది. పెండింగ్‌లో ఉన్న 10 డీఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేసింది. ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను చెల్లించింది. గత మూడున్నరేళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదినే వేతనాలను ఇస్తోంది. పీఎఫ్, సీసీఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ బకాయిలను క్రమేణా యాజమాన్యం తగ్గిస్తోంది. టీజీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యతను సంస్థ ఇస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ది పథంలో పయనిస్తోన్న సంస్థకు, ఉద్యోగులకు సమ్మె అనేది తీరని నష్టం కలిగిస్తుంది. ఆర్టీసీ బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటాం.
సమ్మెవల్ల ఉద్యోగులకే నష్టం..
సమ్మె అనేది సమస్యలకు పరిష్కారం కాదు. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సమ్మె వల్ల ఆర్టీసీ 39 మంది ఉద్యోగులను కొల్పోయింది. సమ్మె తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మీ సమిష్టి కృషి వల్ల అన్ని సంక్షోభాలను ఎదుర్కొని.. ప్రజల మన్ననలు చూరగొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె అనేది శ్రేయస్కరం కాదు. ఒక్కసారి ప్రజలు అసంతృప్తికి గురైతే కొంతకాలంగా సంస్థ బాగు, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇవన్నీ సంస్థ మనుగడకు ప్రతికూల అంశాలుగా మారే ప్రమాదం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డి , రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. సమ్మె వల్ల సంస్థ ప్రగతితో పాటు ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతో పాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం మరిచిపోవద్దని సూచిస్తోంది. ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తూ.. సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉందని పేర్కొంది.
గీత దాటితే ఎస్మా తప్పదు..
ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలపై నిషేధం. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించిన, విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మూడున్నరేళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. వాటిని విజయవంతం కూడా చేశారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోన్న సమయంలో సమ్మె పేరుతో చేజేతులా సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్ కు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహారించవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీపడబోదని మరోసారి స్పష్టం చేస్తోంది.





















