Kavitha: బీఆర్ఎస్ అధినాయకత్వంపై కవిత ఆక్రోశం, అధినేత నుంచి కోరుకుంటున్నది ఇదేనా?
Kavitha:జైలుకు వెళ్లివచ్చినప్పటి నుంచి పార్టీకి దూరం పెడుతున్నారన్నది ఆమె వాదన. పార్టీ కీలకమైన నిర్ణయాల్లో తనను భాగస్వామిని చేయకుండా ఎందుకు దూరం పెడుతున్నారన్నది కవిత ఆవేదన.

Kavitha: BRSలో అంతర్గత సంక్షోభం నెలకొంది. పార్టీ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ బహిర్గతం కావడం, ఆ తర్వాత కేటీఆర్,పార్టీ కార్యాలయంలో స్పందించడం, ఇద్దరు పార్టీ సీనియర్ నేతలను కేసీఆర్, కవిత వద్దకు రాయబారం పంపడం, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కవిత రాయబారం నడిపారని పత్రికల్లో వార్తలు రావడం, ఆ తర్వాత కవిత మీడియాతో చిట్ చాట్ చేయడం ఈ పరిణామాలన్నీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితులను తెలియజేస్తున్నాయి. అయితే వీటన్నింటికి కవిత అసంతృప్తే కారణం. పార్టీ అధినాయకత్వం నుంచి అసలు ఆమె ఏం కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కవిత ఆకాంక్షలేంటో చూద్దాం.
పార్టీలో తాను కోల్పోయిన ప్రాధాన్యతను పునరుద్ధరించాలి
ఉద్యమ సమయంలోను, పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్, హరీశ్ రావుతో సమానంగా తాను పాల్గొన్నప్పటికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆక్రోశం తన లేఖ ద్వారా కవిత బయటపెట్టారు. తాను జైలుకు వెళ్లివచ్చినప్పటి నుంచి పార్టీకి దూరం పెడుతున్నారన్నది ఆమె వాదన. పార్టీ కీలకమైన నిర్ణయాల్లో తనను భాగస్వామిని చేయకుండా ఎందుకు దూరం పెడుతున్నారన్నది కవిత ఆవేదన. పార్టీలో తాను కోల్పోయిన వైభవాన్ని, ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించాలన్నది కవిత ప్రధాన డిమాండ్
కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ నడవాలి
పార్టీలో కొందరు తామే కేసీఆర్‌ను నడిపిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని కవిత మీడియా చిట్ చాట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వం తప్ప మరేవరి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని, ఈ విషయంలో పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కవిత కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో నిన్నటి మొన్నటి వరకు అగ్రనేతగా వెలుగొందిన తనపై ఆరోపణలు వస్తే కనీస మాత్రంగానయినా పార్టీ ఎందుకు స్పందించలేదన్నది ఆమె ప్రశ్న. పార్టీ అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే నడవాలని, నిర్ణయాధికారం కేసీఆరే చేపట్టాలని కవిత తన లేఖ ద్వారా, మీడియాతో వ్యక్తీకరించిన అభిప్రాయాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆరే తన రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలి
మైడియర్ డాడీ అని, కేసీఆరే తన దేవుడని లేఖలో కవిత సంభోధించడం ద్వారా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని కవిత చెప్పకనే చెప్పారు. ఆయన పట్ల తనకున్న స్పష్టమైన విధేయతను లేఖ ద్వారా బహిర్గతం చేశారు. తన తండ్రి పంపిన రాయబారులతో కూడా, నేరుగా కేసీఆర్ తో మీటింగ్ ఏర్పాటు చేయాలని వారిని కవిత కోరడం జరిగింది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన తర్వాతి నుంచి తన తండ్రి ద్వారా తనకు ఎలాంటి దిశానిర్దేశం లేనట్లు స్పష్టం అవుతుంది. తన రాజకీయ భవిష్యత్తుకు కేసీఆరే మార్గనిర్దేశనం చేయాలన్నది కవిత డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ మద్దతును ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
పార్టీ విలీనంపై స్పష్టత ఇవ్వాలి.
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అంశంపై పార్టీకి స్పష్టత ఇవ్వాలన్నది కవిత మరో డిమాండ్. తాను జైలుకు వెళ్లేటప్పుడే ఈ కుట్రలకు తెరలేపారని ఆమె మీడియాతో చెప్పారు. బీజేపీతో కలవడం సరికాదన్న అభిప్రాయాన్ని లేఖ ద్వారా ఇప్పటికే కవిత చెప్పారు. పార్టీ స్వతంత్రంగా పని చేయాలని, విలీనం అనే అంశం ఏకపక్ష నిర్ణయం కాకూడదన్నది కవిత డిమాండ్. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ నిర్ణయాలన్నీ పారదర్శకంగా ఉండాలని, అందులో తన భాగస్వామ్యం ఉండాలని కవిత డిమాండ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కవిత రాసి లేఖ, మీడియాతో ఆమె అభిప్రాయలను వ్యక్తం చేయడం, పార్టీలో నలుగుతున్న సమస్యను సూచిస్తోంది. తాను కోల్పోయన ప్రాధానత్యను తిరిగి పొందడం, కేసీఆరే పార్టీ రథసారథిగా వ్యవహరించాలని సూచించడం, తన రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ నుంచి హామీ కోరడం, పార్టీ విలీనంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇవన్నీ పార్టీలో రగులుతున్న సంక్షోభానికి నిదర్శనాలు. అయితే పార్టీ అధినేత కవిత ఆకాంక్షలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఆయన స్పందనను బట్టే కవిత రాజకీయ లక్ష్యాలు ఉంటాయనడంలో సందేహం లేదు.






















