Vikarabad student dies: వికారాబాద్ జిల్లాలో దారుణం - ఊపాధ్యాయుడు కొట్టడంతో ప్రాణాలు విడిచిన విద్యార్థి
Vikarabad student dies: వికారాబాద్ జిల్లాలో స్కూల్ లో టీచర్ కొట్టడంతో 7వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగిలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
Vikarabad student dies: నిన్న కాక మొన్న కళాశాలలో అధ్యాపకుల ఒత్తిడి భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల క్లాస్ రూములోనే ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేట్ కాలేజీలు పిల్లలపై పెడుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలిచింది ఆ ఘటన. ఆ దుర్ఘటన మరువక ముందే.. ఇప్పుడు జరిగిన మరో సంఘటన మన విద్యా వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి!
తాజాగా వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడు దాడిలో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పూడురు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు సాత్విక్ ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. టీచర్ దాడిలో సాత్విక్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తనను స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలోని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే సాత్మిక్ ప్రాణాలు విడిచాడు.
బెడ్‌పై నుంచి పడ్డాడన్న స్కూల్ యాజమాన్యం, కాదంటున్న తల్లిదండ్రులు
కేశవరెడ్డి స్కూల్ టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల తన కొడుకు సాత్విక్ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు చెన్గోమల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సాత్విక్ కు బెడ్ పై నుండి కింద పడటం వల్లే గాయాలు అయ్యాయని పాఠశాల యాజమాన్యం అంటోంది. విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాత్విక్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో విచారణ చేపట్టారు.
అధ్యాపకుల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మూడ్రోజుల క్రితం హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సాత్విక్ అనే విద్యార్థి తరగతి గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కళాశాలలో పెట్టే ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తే.. కనీసం ఆసుపత్రికి కూడా సిబ్బంది తరలించలేదని వివరించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఓ వాహనం లిఫ్టు అడిగి మరీ అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడని వివరించారు.
సాత్విక్ తల్లిదండ్రులు కుమారుడి మృతి గురించి తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. గతంలో లెక్చరర్లు కొట్టడంతో 15 రోజుల పాటు సాత్విక్ ఆస్పత్రి పాలయ్యాడని వివరించారు. లెక్చరర్లందరికీ తమ కుమారుడిని ఏం అనొద్దని చెప్పి మళ్లీ హాస్టల్ లో చేర్పించినట్లు ఏడుస్తూ తెలిపారు. మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కళాశాల యాజమాన్యమే విద్యార్థి మృతికి కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీచైతన్య కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. సాత్విక్ మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.