Praja Bhavan Rash Driving Case: ప్రజా భవన్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్, బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్ అరెస్ట్ - ఎందుకంటే!
Praja Bhavan Accident: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ (Rash Driving)కేసులో పంజాగుట్ట పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
EX MLA Shakeel son Shahil: హైదరాబాద్: గతేడాది డిసెంబరులో ప్రజాభవన్ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ (Rash Driving)కేసులో పంజాగుట్ట పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు, నిందితుడు సాహిల్ ను దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ గత డిసెంబర్ లో అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట బారీకేడ్లను కారుతో ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన తరువాత, కేసు నుంచి బయటపడేందుకు తనకు బదులుగా డ్రైవర్ గా వేరే వ్యక్తిని పంపించే ప్రయత్నం చేశారు. కానీ విషయం బయటకు తెలిసి వైరల్ గా మారడంతో పోలీస్ శాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కానీ అప్పటికే నిందితుడు సాహిల్ దుబాయ్ పారిపోయాడని, అందుకు 10 మంది సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పంజాగుట్ట పోలీసులు ఆదివారం మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేని బోధన్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.
గత డిసెంబర్ నెలలో ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. డిసెంబరు 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అత్యంత వేగంతో ఓ బీఎండబ్ల్యూ కారు (TS 13 ET 0777) ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ నియంత్రణ కోసం అడ్డుగా ఉంచిన బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. కేసులో మొదట మరో వ్యక్తిని కారు నడిపాడని చెప్పి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. వైద్య పరీక్షలు చేయడం, అతడిని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి మద్యం తాగలేదని గుర్తించారు. కానీ డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ అని విషయం బయటకు రావడంతో కేసు మలుపు తిరిగింది.
ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా తరువాత చేర్చారు. ఈ విషయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. కుమారుడ్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి షకీల్ కొడుకు రహిల్ అని డీసీపీ చెప్పారు. ప్రధాన నిందుతుడ పరారీలో ఉండా, మిగతా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలోనూ కారుతో విధ్వంసం సృష్టించి ఒకరి మరణానికి సాహిల్ కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించాడని బోధన్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.