TSRTC: మీరు సిటీ బస్ ఎక్కుతారా? అయితే గుడ్‌న్యూస్.. మీకు డబ్బు ఆదా.. సంస్థకు లాభం!
సిటీ బస్సుల్లో రోజూ ప్రయాణించే వారికి సాధారణ బస్ పాసులే కాకుండా రూట్ పాసులు కూడా ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు బాగా డబ్బు ఆదా అవుతుంది. అంతేకాక, ఆర్టీసీకి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఆర్టీసీకి వీసీ సజ్జనార్ ఎండీగా నియమితులు అయిన తర్వాత సంస్థను లాభాల బాట పట్టించేలా కీలకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సంస్థకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా అదే సమయంలో ప్రయాణికులకు డబ్బు ఆదా అయ్యేలా ఓ మార్పు తీసుకొస్తున్నారు. సిటీ బస్సుల్లో రోజూ ప్రయాణించే వారికి సాధారణ బస్ పాసులే కాకుండా రూట్ పాసులు కూడా ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు కేవలం పదో తరగతి వరకు చదివే విద్యార్థులకే పరిమితమైన ఈ రకం పాసులను అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు కూడా వర్తింపజేయనున్నారు.
దీనివల్ల ప్రయాణికులకు బాగా డబ్బు ఆదా అవుతుంది. అంతేకాక, ఆర్టీసీకి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. రోజూ ఇంటి నుంచి కార్యాలయాలకు ఒకే మార్గంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు ప్రతి నెలా రూ.1200 పైన చెల్లించి సాధారణ బస్ పాసులు తీసుకోవాల్సి వస్తుంది. వీటి ద్వారా సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా, ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు.
Also Read: రసవత్తరంగా హుజూరాబాద్ ఉపఎన్నిక... అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థి ఎవరంటే..?
కానీ, ఉద్యోగులు, విద్యార్థులు చాలా వరకు ఇంటి నుంచి ఆఫీసులకు, లేదా స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వారు కూడా మామూలు పాసులు తీసుకోవాల్సి వస్తుంది. నగరంలో లక్షలాది మంది చిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసేవారు ఉన్నారు. కానీ, బస్‌పాస్ వినియోగదారుల సంఖ్య కేవలం 5 లక్షలకు పైగానే ఉంది. సాధారణ పాస్‌లతో పాటు ప్రయాణికులు కోరుకున్న రూట్ వరకు పాస్ ఇవ్వడం వల్ల వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: దసరాకి ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు.. ప్రత్యేక వడ్డన, ప్రత్యేక సర్వీసులు అంటున్న ప్రభుత్వాలు
ఈ తరహా రూట్ పాసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు నిర్ణీత స్థలాలకు రాకపోకలు సాగించే చిరు వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్జీవో పాస్‌లు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు జీబీటీలతో పాటు పరిమిత సంఖ్యలో రూట్‌పాస్‌లు, గ్రేటర్ పాస్‌లు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు, కాలేజీలు పని చేస్తున్నాయి. దసరా అనంతరం మరిన్ని విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో రూట్‌పాస్‌లను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.