Tollywood Protest : రెండో రోజూ షూటింగ్ లు బంద్, మంత్రి తలసాని వద్దకు సినీ కార్మికుల పంచాయితీ
Tollywood Protest : టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన వేతన పెంపు నిరసనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇరు వర్గాలు మంత్రి తలసాని వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Tollywood Protest : టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. రెండో రోజు కూడా షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే సినీ కార్మికులు ఆందోళన ఇప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చేరింది. ఈ సమస్యపై మంత్రి తలసాని మాట్లాడుతూ పంతాలు, పట్టింపులు వద్దని ఇరు పక్షాలకి సూచించానన్నారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్న ఆయన కరోనా పరిస్థితుల కారణంగా కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇరు వర్గాలు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి తలసాని సూచించామన్నారు. షూటింగ్‌లపై రెండు పక్షాలు రెండు వాదనలు వినిపిస్తున్నాయని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరిగేలా మాట్లాడుకోవాలని ఆయన సూచించారు.
రెండో రోజూ షూటింగ్ లు బంద్
వేతనాలు పెంచాలని టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన నిరసనలతో రెండోరోజు కూడా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో 25కు పైగా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయినట్లు సమాచారం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రం సినీకార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపుపై చర్చిస్తామని చెబుతోంది. 15 రోజుల పాటు పాత పద్ధతిలోనే సినీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు పంచాయితీ చేరింది. ఆయనను ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు, నిర్మాతల మండలి నేతలు వేర్వేరుగా కలిసి తమ సమస్యలు వివరించారు.
షూటింగ్ ఆపడానికి మేము సిద్ధం- సి.కల్యాణ్
అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాత సి.కల్యాణ్ షూటింగ్ లకు హాజరైతేనే వేతనాలు పెంపుపై చర్చిస్తామన్నారు. తమ మాటకి కట్టుబడి ఉన్నామని షూటింగ్‌లు ప్రారంభమైతే వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇవాళ కూడా షూటింగ్‌లు జరగడం లేదన్నారు. నిర్మాతలంతా ఎవరితో పనిచేయించుకోవాలో వారితో చేయించుకుంటామని అంటున్నారన్నారు. అవసరమైతే షూటింగ్‌లు ఆపడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
40 వేల మంది కార్మికులు నిరసన బాట
ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ జరుపుకుంటున్న 20కి పైగా చిన్న పెద్ద సినిమాల షూటింగ్స్ సైతం ఆగిపోయాయి. ఏకంగా 40 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి నిరసనబాట పట్టారు. ప్రతీ ఏడాదీ వేతనాలు పెంచమని అడగడంలేదని కార్మికులు అంటున్నారు. కనీసం మూడేళ్లకొకసారైన 30 శాతం పెంచుతామని నిర్మాతలే అన్నారు. అలా మూడేళ్లు ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నామని కార్మికులు అంటున్నారు. ఏకంగా నాలుగున్నరేళ్లు దాటిపోయినా ఇప్పటికీ వేతనాలు పెంచలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో పెంచలేక పోయామని సాకు చూపించాలనుకున్నా.. కోవిడ్ తరువాత వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైయ్యాయన్నారు. హీరోలు సైతం కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read : Tollywood Protests: హీరోలకు కోట్లు, మాకు పొట్టకూటి కోసం పాట్లా? గర్జించిన తెలుగు సినీ కార్మికులు
Also Read : Tollywood Protest : టాలీవుడ్ లో సమ్మె సైరన్, రేపటి నుంచి షూటింగ్ లు బంద్!