(Source: ECI | ABP NEWS)
Polio Drive: తెలుసు కదా! ఆదివారం ప్రత్యేక పోలియో డ్రైవ్ - తెలంగాణలో ఆరు జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు
Polio Drive: తెలంగాణలో ఆరు జిల్లాల్లో ప్రత్యేకంగా పోలియో డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Polio Drive: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఆదివారం పోలియో చుక్కలు వేయనున్నారు. అత్యంత కీలకమైన సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే ను పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని కోసం ముమ్మర ఏర్పాట్లు చేసింది. పోలియో రహిత దేశాల జాబితాలో భారత్ ఉన్నప్పటికీ, పొరుగు దేశాల్లో వెలుగు చూస్తున్న కేసులో ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అందుకే దేశంలోకి మళ్లీ వైరస్ ప్రవేశించకుండా ఉండేందుకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అత్యంత కీలకమైన సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID) డ్రైవ్ చేపడుతోంది.
అక్టోబర్ 12, 13, 14 తేదీలలో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. కేవలం ఆరు కీలక జిల్లాలపై దృష్టి పెట్టింది. హెల్త్ డిపార్ట్‌మెంట్, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మాత్రమే డ్రైవ్ కొనసాగుతోంది.
ఈ ఆరు జిల్లాలను ఎంపిక చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పట్టణ, వలస జనాభా ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్లు సాధారణ ఆరోగ్య సేవలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి వారికి వైరస్ సోకితే ప్రమాదమని భావించారు. అందుకే ఈ జిల్లాల్లో డ్రైవ్ చేపడుతున్నారు.
హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ సెక్రటేరియెట్‌లో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆరు జిల్లాల్లో ఈ డ్రైవ్‌ను నాలుగు రోజుల పాటు మహాయజ్ఞంలా నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. అక్టోబర్ 12 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారు. దీని కోసం హైదరాబాద్‌లో మొత్తం 2,843 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ నాలుగు రోజుల్లో దాదాపు 5.17 లక్షల మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 13 నుంచి 15 వరకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసుకున్నారో లేదో పరిశీలిస్తారు. మొదటి రోజు కేంద్రాలకు రాలేకపోయిన పిల్లలను గుర్తించేందుకు వ్యాక్సిన్ వేస్తారు.





















