Telangana Job Calendar:తెలంగాణలో కొలువుల కొత్త శకం త్వరలో ప్రారంభం- జాబ్ క్యాలెండర్ విడుదలకు కసరత్తు
Telangana Job Calendar: తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అరవై వేలకు పైగా పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు మిగతా ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేయనుంది.

Telangana Job Calendar: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని నియామకాలను రేవంత్ సర్కార్ చేపట్టింది. డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-1, గ్రూప్-3 నోటిఫికేషన్లు వేసింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడిస్తారని ప్రతిపక్షాలతోపాటు నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది. ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు ఆందోళనలు కూడా చేపట్టారు. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి, లోకల్ బాడీ ఎన్నికలు, ఇతర కారణాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధమైంది.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ముగిసింది. పెండింగ్‌లో ఉన్న కొన్ని పోస్టుల భర్తీ కూడా జరిగిపోయింది. న్యాయపరమైన అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఇకపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడు నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండబోవని ఖాళీలు కూడా భారీగా ఉంటాయని చూస్తోంది. దాదాపు 30వేలకుపైగా ఖాలీలతో క్యాలెండర్ విడుదల అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇరవై వేలకుపైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించినట్టు తెలుస్తోంది. మిగతా వాటికి అనుమతి వచ్చిన వెంటనే వాటితో క్యాలెండర్ విడుదలకానుంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అరవై వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో ఉపాధ్యాయ, పోలీస్, వైద్య, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి. టీజీపీఎస్సీ ద్వారా కూడా నియామకాలు జరిపింది. ఇందులో గ్రూప్ -3 మినహా మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యింది. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 నియామక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత దీన్ని చేపట్టనుంది. ఈ మూడు పరీక్షలను కామన్‌గా చాలా మంది అభ్యర్థులు రాసి ఉంటారు. అన్నింటిలో ఉత్తీర్ణత సాధించి ఉంటారు. అందుకే ముందు గ్రూప్-1, తర్వాత గ్రూప్ -2, అనంతరం గ్రూప్-3 నియామకాలు చేపడితే అభ్యర్థులు స్థాయి రీత్యా పోస్టులు ఎంపిక చేసుకుంటారు. అలా చేయకుంటే గ్రూప్-3 ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తికి గ్రూప్-1 వస్తే ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. దీని వల్ల ఆ పోస్టు ఖాళీ అవుతుంది. అలా కాకుండా ముందే గ్రూప్-1 భర్తీ ప్రక్రియ చేపడితే అందులో ఉద్యోగాలు రాని వ్యక్తి గ్రూప్-2 లేదా గ్రూప్-3 వచ్చి ఉంటే అందులో జాయిన్ అవుతారు.
సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఖాళీలను సేకరిస్తున్నారు. ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 20 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఉంది. మరికొన్ని పోస్టులకు కూడా అనుమతి పొందిన తర్వాత అన్నింటిని క్యాలెండర్‌లో యాడ్ చేస్తారు. ఎప్పుడు ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారో ఎన్ని రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి అవుతుందో ఆ క్యాలెండర్‌లో వివరంగా చెబుతారు. దీంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ సులభమవుతుంది.
ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు, క్యాలెండర్‌లో పెట్టాల్సిన పోస్టులపై ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తోంది. ప్రక్రియను వీలైన త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ కారణాలతో కొందరు ఉద్యోగాల్లో చేరకపోవడంతో ఆ పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడ్డాయి. అలాంటి ఉద్యోగాలు నాలుగు వేల వరకు ఉన్నాయి. ఇందులో గురుకుల నియామక బోర్డు పరిధిలోనే సగం ఉన్నాయి. ఇవి కాకుండా టీజీపీఎస్సీ ద్వారా చేపట్టిన నియామకాల్లో కూడా వంద వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే వివిధ విభాగాల్లో ఖాళీలు గుర్తించారు. ఆర్టీసీ, మెడికల్ విభాగాల్లో పదివేలు, 12వేలకుపైగా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే త్వరలోనే నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని అధికారులు చెబుతున్నారు.





















