Telangana Latest News: తెలంగాణ విద్యా కేలండర్‌లో భారీ మార్పులు- పరీక్షల నుంచి సెలవుల వరకు పూర్తి వివరాలు ఇవే!
Telangana Latest News: తెలంగాణ విద్యాసంవత్సర కేలండర్ వచ్చేసింది. సెలవుల నుంచి పరీక్షలు వరకు అన్నింటిలో చాలా మార్పులు చేశారు.

Telangana Latest News: తెలంగాణలో జూన్ 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. పరీక్షలు, సెలవులు, ఉపాధ్యాయుల సర్దుబాటు అన్నింటిపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడు ఏం చేయాలనే విషయాపై షెడ్యూల్ రిలీజ్ చేసింది.
2025–26 విద్యా సంవత్సరం కేలండర్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కేలండర్ ప్రకారం జూన్ 12న ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం వచ్చే ఏప్రిల్ 23తో ముగుసుంది. మొత్తంగా 230 రోజులు స్కూల్స్ పని చేయనున్నాయి. ఈ కేలండర్‌లో ప్రభుత్వం చాలా మార్పులు చేర్పులు చేసింది. జనవరి 10 నాటికి అన్ని సిలబస్‌లను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మార్చిలోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
స్కూల్స్‌లో యోగా
పాఠశాలల్లో కచ్చితంగా యోగాను భాగం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు కేలండర్‌లో పేర్కొంది. రోజుకు ఐదు నిమిషాలపాటు పిల్లలకు ధాన్యంపై అవగాహన కల్పించాలని చెప్పింది. ఆగస్టు 28 వరకు దాదాపు రెండు నెలల పాటు విద్యాప్రవేశాలు అమలు చేయనుంది. విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పుతారు. రెండో తరగతి నుంచి 9వ తరగతి వాళ్లకు జూన్ 30 వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. వారిని సన్నద్ధం చేయడంలో ఇదో భాగం.
దసరాకు 13 రోజులు, సంక్రాంతికి నాలుగు రోజుల సెలవులు
సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలువులు ఇస్తారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్‌మస్ సెలవులు ప్రకటించారు. 2026 జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
జనవరి నాటికి అన్ని తరగతుల సిలబ్ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సంక్రాంతి సెలవుల తర్వాత రివిజన్ ఉంటుందని పేర్కొంది. మార్చిలోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీని కోసం విద్యార్థులను ప్రిపేర్ చేయాలని తెలిపింది. వారిపై ఎలాంటి ఒత్తిడిలేకుండా పరీక్షలు రాసేందుకు పరీక్ష విదానంలో కూడా మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇకపై పదోతరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండబోవని స్పష్టం చేశారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) పరీక్షలను మాత్రం నాలుగే ఉంచారు. వీటిని తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోలేదు.
సీసీఈ, ప్రాజెక్టులు కొనసాగుతాయని ప్రభుత్వం కేలండర్‌లో స్పష్టం చేసింది. పదోతరగతి విద్యార్థులకి కూడా ప్రాజెక్టులు ఉంటాయని తేల్చి చెప్పింది. కానీ ఆ మార్కులు మాత్రం ఫైనల్ మార్కుల్లో కలవబోవని చెప్పింది. జులై 31 నాటికి ఎఫ్‌ఏ-1 పూర్తి చేయనున్నారు. ఎఫ్‌ఏ-2ను సెప్టెంబర్ 30 నాటికి కంప్లీట్ చేయాలి. ఎఫ్‌ఏ 3 డిసెంబర్ 23, ఎఫ్-4 ఫిబ్రవరి 7 నాటికి పదోతరగతి విద్యార్థులకు, 28 నాటికి మిగతా విద్యార్థులకు పూర్తి చేయాలి. ఎస్‌ఏ 1 అక్టోబర్ 24 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. ఎస్‌ఏ-2 ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రం మార్చిలో ఉంటాయి. అంతకంటే ముందు వారికి ఫిబ్రవరి 28 నాటికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
ఉపాధ్యాయులకు నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ మావేశాలను ఏడుకు పెంచారు. డిసెంబరు,జనవరిలో పాఠశాల వార్షికోత్సవాలు జరపాలని పేర్కొన్నారు. ఆగస్టు 1, 2 వారాల్లో పాఠశాల స్థాయి, మండల, జిల్లాల స్థాయిలో క్రీడా పోటీలు చేపడతారు. సెప్టెంబరు నాలుగో వారంలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ఉంటుంది. ఇన్‌స్పైర్ జాతీయ పోటీలు ఆగస్టులో, జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ పోటీలు అక్టోబరు లేదానవంబరులో, రాష్ట్రస్థాయి ప్రాజెక్టు పోటీలు డిసెంబరులో చేపడతారు. అక్టోబరులో మండల స్థాయిలో ఆర్‌ఎస్‌బీవీపీ పోటీలు నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో జిల్లా స్థాయి, డిసెంబరు లేదా జనవరిలో రాష్ట్రస్థాయి పోటీలు చేపడతారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు అంశపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 13 నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి మొదట భావించినప్పటికీ ఉపాధ్యాయుల ఒత్తిడి కారణంగా ఆ గడవును జులై 15కు మార్చింది. జూన్ ఆరున మొదలైన బడిబాట 19వ తేదీ వరకు కొనసాగిస్తారు. అందుకే ఈ సర్దుబాటు ప్రక్రియను వాయిదా వేశారు.





















