Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
Telangana Assembly Budget Sessions : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు.
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసన మండలి, శాసన సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన రెండు చోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎన్ని బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలి వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో సబ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
ఈ సమావేశాల్లలోనే సోమవారం రోజు అంటే ఈనెల 6వ తేదీన 2023-24 ఆర్థిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల ఐదో తేదీన అంటే ఆదివారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పై క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది.
రూ. 3 లక్షల కోట్ల వరకూ తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. అయితే ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేసుకుంటుందన్నది కీలకం. రూ. మూడు లక్షల కోట్ల కేటాయింపులు వివిధ పథకాలకు చేస్తే సరిపోదు.. ఆ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారో కూడా పద్దుల్లోనే చూపించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, నిధులు రాలేదు. చివరికి అప్పులపై కూడా పరిమితి విధించారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది.
ఆదాయ వృద్ధిలో రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ
దేశంలోనే GSDP వాటాలో రెండో స్థానం సాధించిన తెలంగాణ.. 8శాతం సొంత పన్నుల ఆదాయం వాటాతో కేంద్ర ఆర్ధిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. 2019-20లో 69శాతం, 2020-21లో 72శాతం, 2021-22లో 73శాతం సొంత వనరుల రాబడి నుంచే ప్రభుత్వం వ్యయాలు చేసి సొంత కాళ్లపై నిల్చింది. ఇక కేంద్రం నుంచి 2014-15లో పన్నుల వాటా 8వేల 189కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ల రూపంలో 6వేల 736కోట్లు, 2022-23లో కేంద్ర పన్నుల వాటా 18వేల కోట్ల అంచనాల్లో 12వేల 407 కోట్లకు సవరించారు. నవంబర్ నాటికి 7వేల 568 కోట్లే ఖజానాకు చేరాయి. గ్రాంట్లు 8వేల 619కోట్లు మాత్రమే వచ్చాయి. గతం కంటే ఈ రెండు భారీగా తగ్గుదల నమోదయ్యాయి. అప్పుల్లో 19 వేల కోట్లు కోతలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదిలో కేంద్రం నుంచి 59వేల కోట్ల అంచనాల్లో 24వేలకోట్లే వాస్తవంలో తెలంగాణకు దక్కనున్నాయి. వచ్చ ఏడాది కూడా ఇంతకు మించి పెద్దగా వస్తాయని కూడా ఊహించలేని పరిస్థితి.