ఉస్మానియాలో రోడ్డెక్కిన విద్యార్థులు, TSPSC రద్దు చేయాలని డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ పై నమ్మకం లేదని, కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ద్వారా పోటీ పరీక్షలను నిర్వహించాలని నినదించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని వాపోయారు. అమాస, పున్నానికి వేసిన నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ.. మాలాంటి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేదని హైకోర్టు ఇప్పటికే ప్రిలిమ్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష రద్దుకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 11 న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు..గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్ళీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్షలు రద్దవడం ఇది రెండోసారి.