Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం! ఐదంతస్తులకూ వ్యాపించిన మంటలు
నవకేతన్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటల తీవ్రత ఎక్కువగా కనిపించడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పక్కనే ఉన్న భవనాలలోని కార్యాలయాలను, దుకాణాలను మూసి వేయించారు.
సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఎదురుగా ఉన్న నవకేతన్ బహుళ అంతస్తుల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనంలో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు అయిదో అంతస్తు వరకు వ్యాపించాయి. నవకేతన్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటల తీవ్రత ఎక్కువగా కనిపించడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పక్కనే ఉన్న భవనాలలోని కార్యాలయాలను, దుకాణాలను మూసి వేయించారు. ముఖ్యంగా ఈ భవనం పక్కనే ఉన్న భవనం సెల్లార్ లో నడుస్తున్న మధుషాల బార్ ను కూడా మూయించారు. సెల్లార్ లో ఈ బార్ అనేక సంవత్సరాల నుండి నడుస్తుంది. ఈ బారుకు ఎలా అనుమతులు లభించాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నవకేతన్ కాంప్లెక్స్ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
నవకేతన్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి తెలిపారు. భవనం లోపల ఉన్న అగ్నిమాపక పరికరాల సహాయంతో వెంటనే ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరికరాలు పని చేయడంతో పాటు సిబ్బందికి వాటిపైన అవగాహన ఉండడం జరిగిందని వెల్లడించారు. ఘటన స్థలికి రెండు ఫైర్ ఇంజన్లతో చేరుకొని మిగిలి ఉన్న మంటలను ఆర్పి వేయడం జరిగిందని తెలిపారు. సెల్లార్లో వైర్లకు మంటలు అంటుకొని పైవరకు పాకాయని ఇవి కేవలం బాల్కనీలోనే ఉండడంతో మంటలు కార్యాలయాలు లోపలికి మంటలు ప్రవేశించలేదని అన్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి విచారణ చేస్తున్నట్లు వివరించారు.