MLC Mahender Reddy: టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసమే పని చేస్తా: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
MLC Mahender Reddy: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం శాయశక్తులా పని చేస్తానని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.
MLC Mahender Reddy: తెలంగాణ రాష్ట్ర సమితికి విధేయుడిగా ఉంటానని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో తాండూరు నుండి టీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం పని చేస్తానని తెలిపారు మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులోని తన స్వగృహంలో మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఎమ్మెల్సీ.. రాబోయే ఎన్నికలు, టికెట్ల కేటాయింపులపై ఆసక్తికర కామెంట్లు చేశారు.
టికెట్ నాకే.. కానీ!
రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు మహేందర్ రెడ్డి. పార్టీ అధిష్ఠానం తాండూరు రాజకీయాలపై తనకు కొన్ని విషయాల గురించి స్పష్టత ఇచ్చిందని అవి పార్టీకి, తనకు మధ్యే ఉంటాయని వెళ్లడించారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. ఏం జరిగినా పార్టీలోనే కొనసాగుతానని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు.
నా చేతుల్లో ఏం లేదు..
వికారాబాద్, తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్లను మార్చే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అధిష్ఠానం తేల్చి చెప్పిందని మహేందర్ రెడ్డి తెలిపారు. స్థానికంగా మీకు మీరే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిందని వెల్లడించారు. ఛైర్ పర్సన్లను రాజీనామా చేయాలని చెబుతుంటే వాళ్లు చేయడం లేదని, అలా అయితే తాను ఏమీ చేయలేనని వెల్లడించారు. మున్సిపాలిటీ పాలన వ్యవహారాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జోక్యం చేసుకోబోరని మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే పాలక వర్గాలు ఆహ్వానిస్తే వెళ్లాలన్న నిబంధన ఉందని.. దాని ప్రకారం నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నడుచుకుంటారని వెల్లడించారు. పురపాలికల్లో ఛైర్ పర్సన్ల నిర్ణయాలే ఫైనల్ అని వివరించారు. జిల్లాలో రాజకీయంగా ఏం జరుగుతుందో తనకు ఓ అవగాహన ఉందని, ఎవరు ఏం చేస్తున్నారో తనకు బాగా తెలుసుని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లాలో నూతన కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ భవన్ కూడా ప్రారంభించనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ కార్యక్రమానికి జిల్లా నుండి లక్ష మందికి పైగా జనాలను తరలిస్తానని తెలిపారు ఎమ్మెల్సీ.
ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..
తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గాల మధ్య కొంత కాలం నుంచి వర్గ పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే ఈ ఇరువురు నాయకుల మధ్య ఘర్షణ విషయం పార్టీ అధిష్ఠానం వరకు వెళ్లినా.. రాజీ మాత్రం కుదరడంలేదు. దీంతో ఇద్దరు నాయకులు జోరుగా గ్రూపు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వచ్చేది తనకంటే తనకు అంటూ ఇరువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండున్నరేళ్లుగా ఇద్దరి మధ్య వార్..
తాండూరు టీఆర్ఎస్ లో రెండున్నరేళ్లుగా రచ్చ జరుగుతోంది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున మహేందర్ రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున రోహిత్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై అప్పటి కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత రోహిత్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు.