ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత
రెండు రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఆమె హాజరుపై ఉత్కంఠ నడిచింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న వేళ అసలు ఈడీ విచారణకు హాజరవుతారా కారా అనే ఉత్కంఠ కొనసాగింది. వాటిని బ్రేక్ చేస్తూ ఈడీ నిర్దేశించిన సమయం కంటే ముందే విచారణ హాజరయ్యారు.
ఉదయం ఇంటి వద్ద బయల్దేరిన కవిత అభిమానులకు అనుచరులకు విక్కరీ సింబల్ చూపించారు. కారు ఎక్కుతూ దేవుణ్ని ప్రార్థించుకొని పిడికిలి ఎత్తి లోపలికి వెళ్లి కూర్చున్నారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యలయానికి చేరుకున్న ఆమెను భర్త ఈడీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లారు.
మహిళను ఇంటి వద్దే విచారించాలన్న పాయింట్‌తో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. దీని విచారణ 24న చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు ఉన్నందునే 16వ తేదీన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీకి ఓ పెద్దలేఖను రాశారు. అందుకే ఇవాళ్టి విచారణకి కూడా హాజరు కారేమో అన్న సందేహం నెలకొంది.
మొన్న ఈడీ విచారణకు గైర్హాజరైన కవిత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని లేఖ రాశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదని సూచించారు. మహిళను ఈడీ ఆఫీస్‌కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగులో ఉందని లేఖలో గుర్తు చేశారు. చట్టసభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు.. చట్టవిరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి, అన్ని అవకాశాలను వాడుకుంటానని లేఖలో పేర్కొన్నారు. తన ప్రతినిధి సోమ భరత్ ద్వారా బ్యాంక్ స్టేట్మెంటుతో సహా ఈడీ అడిగిన పత్రాలు పంపుతున్నానని లేఖలో వివరించారు.
మహిళా నాయకురాలిగా, పౌరురాలిగా, మహిళల హక్కులకు సంబంధించినంత వరకు చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవడం తన బాధ్యత అన్నారు ఎమ్మల్సీ కవిత. ఒక చట్టసభకర్త అయినందున, చట్టబద్ధమైన పాలన సాగేలా ఏ ఏజెన్సీ ద్వారా ఎటువంటి ఉల్లంఘన జరగకుండా చూసుకోవడం తనబాధ్యత అని లేఖలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని PMLA చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీ చేసిన నోటీసులు CRPC సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని ఆమె లేఖలో వివరించారు.
ఈ క్రమంలో ఈడీ మళ్లీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 విచారణకు హాజరుకావాలని నోటీసులో సూచించింది! ఇంటిదగ్గరే విచారించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ఈనెల 24న విచారణ చేపట్టనున్న క్రమంలో ఈడీ ఇచ్చిన తదుపరి నోటీసులకు కవిత ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు విచారణకు హాజరై సస్పెన్ష్‌కు తెరదించారు.
మార్చి 11న మొదటిసారి ఈ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన కవితను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు అధికారులు. ఆమె ఫోన్‌ను ఇంటి దగ్గర నుంచి తెప్పించి మరీ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను సీజ్ చేసి దాంట్లో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. దీని ఆధారంగా ఇవాళ ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులను కూడా నేటి విచారణలో భాగం చేస్తారని తెలుస్తోంది. ముఖాముఖీగా వారితో కూర్చోబెట్టి కవితను విచారిస్తారని సమాచారం.