MLA Rajasingh: అరెస్టు చంద్రబాబుకి ప్లస్సే, వచ్చే ఎన్నికల్లో ఆయనదే విజయం: రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
MLA Rajasingh: చంద్రబాబు అరెస్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే విజయం సాధిస్తారని అన్నారు.
MLA Rajasingh: చంద్రబాబు నాయుడు అంటే జగన్ మోహన్ రెడ్డికి భయం పుట్టిందని.. అందుకే ఆయనను అరెస్ట్ చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన రజాకార్ టీజర్ విడుదల కార్యక్రమానికి రాజాసింగ్ అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గోషామహల్ ఎమ్మెల్యే.. చంద్రబాబు అరెస్టుపై మొదటిసారి స్పందించారు. బంతిని కిందకి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుందని.. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఫేక్ అని కోర్టు కొట్టి వేస్తుందని తెలిపారు. ఈ అరెస్ట్ జగన్ మోహన్ రెడ్డికి మైనస్ అవుతుందని, చంద్రబాబుకి ప్లస్ అవుతుందని అన్నారు. ముందు నుంచి ప్రజల్లో చంద్రబాబు సేవకుడు అన్న మంచి పేరు ఉంద్న రాజాసింగ్.. వచ్చే ఎన్నికల్లో ఆయననే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీలో పోలీసులు తీవ్రమైన నిర్బంధాలు పెడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఎమర్జెన్సీ తరహా నిర్బంధాల మధ్య కూడా ప్రజలు అనూహ్యంగా రోడ్ల మీదకు వస్తుండటం ఆశ్చర్య పరుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా శనివారం గుంటూరులో మహిళలు ఆ బాధ్యత తీసుకున్నారు. ఒక్క సారిగా నాలుగైదు వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఇలా వచ్చారని తెలిసి ఇతర మహిళలూ వారితో జత కలిశారు.
చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు చేయాలనుకుంటున్న సామాన్యులు, కాలనీల ప్రజలు వారికి వారు మాట్లాడుకుని.. ఓ సమయం చూసుకుని ర్యాలీలు ప్రారంభిస్తున్నారు. ఈ స్వచ్చంద నిరసనలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందు కృష్ణా జిల్లా మహిళలు ప్రారంభించారు. మెల్లగా ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ గ్రామంలోనూ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవుడికి కొబ్బరి కాయలు కొట్టడం వంటి వాటి దగ్గరనుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
మరో వైపు తెలంగాణలో కూడా నిరసన పెరుగుతున్నాయి. మొన్న ఖమ్మం, సత్తుపల్లిలో నిరసనలు జరిగాయి. తాజాగా నల్లగొండ జిల్లా కోదాడ, నిజామాబాద్ వంటి చోట్ల కూడా ప్రజలు స్వచ్చందంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక హైదరాబాద్ గురించి చెప్పాల్సి పని లేదు. వీరిలో టీడీపీ సానుభూతిపరులు ఉన్నా.. ప్రస్తుతం అక్కడ పార్టీ కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపోతుంది. చంద్రబాబుకు మద్దతుగా ప్రజా ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అంచనా వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల నిరసనను ఉద్యమంలా మార్చాలని నిర్ణయించుకుంది. పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు పోస్టు కార్డు పంపాలని టీడీపీ ప్రజల్ని కోరింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మంగళవారం జరగనుంది.