Akbaruddin Owaisi: తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు - అక్బరుద్దీన్ ఫైర్, అంతలోనే ట్విస్ట్ !
Akbaruddin Owaisi: తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మూడేళ్ళ నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు.
Akbaruddin Owaisi: తెలంగాణ ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నేడు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన కేసీఆర్ అందులో 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో భాగంగా 11,103 కాంట్రాక్ట్ పోస్టులను క్రమబద్ధీకరిస్తున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందించారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క ముస్లింకు కూడా ప్రయోజనం కలగలేదు
అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేశామని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మూడేళ్ళ నుంచి ఒక్క రూపాయి ఇవ్వడం లేదని అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin fires on Telangana Government over minority welfare) ఆరోపించారు. మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ నుండి ఒక్క ముస్లింకు కూడా లబ్ది జరగలేదని పేర్కొన్నారు. మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని, దీనిపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సమాధానం చెప్పాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. మహమూద్ అలీ వల్ల ఒక్క ముస్లిం యువకుడైనా బాగుపడ్డాడా అని అసెంబ్లీలో ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన షాదీ ముబారక్‌తో కొందరికి లబ్ది చేకూరిందన్నారు.
భవిష్యత్తులోనూ ఎంఐఎం దారి ఇదే..
రాష్ట్ర పౌరుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసిందని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఆరోగ్యశాఖలో అంత బాగాలేదన్నారు. టీమ్స్ హాస్పిటల్ ఘనంగా ఓపెన్ చేసి కూడా ఎందుకు మూసివేశారో తెలీదన్నారు. అభినందనలు మాత్రమే కాదు, విమర్శలను సైతం ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం లెక్కలు తప్పు చెప్తోంది. బంగారు తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం కలిసి ముందుకు వెళుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మంచి చేస్తోందని, అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్‌దేనని, తమ పార్టీ మరోసారి కలిసి పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు అక్బరుద్దీన్. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఈ సమావేశాల్లోనూ గతంలోలాగ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
Also Read: Telangana Jobs Notification 2022: తెలంగాణలో ఉద్యోగాలు జిల్లాల వారీగా, ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు