Minister Harish Rao: ఆ తప్పుతో ఇతర్రాష్ట్రాలకు తెలంగాణ ఆదాయం- సరిచేయాలని జీఎస్టీ మండలికి హరీష్ వినతి
రాష్ట్ర విభజన తరువాత నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతోందని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు హరీష్.
ఛండీగడ్‌లో 28, 29 తేదీల్లో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు తెలంగాణ తరఫున చాలా సమస్యలను జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తరువాత నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతోందని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్ చిరునామాలు తెలంగాణలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ విషయంలో ప్రతిపాదిత కొత్త 3బి ఫారమ్‌లో GSTR 3B రిటర్న్‌లలో నెగిటీవ్ వాల్యూను అనుమతించాలని ప్రతిపాదించినందుకు కౌన్సిల్‌కు ధన్యవాదాలు తెలిపారు హరీష్. ప్రస్తుత 3బి రిటర్న్‌లో కూడా అదే సదుపాయాన్ని పొందుపరచాలని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌ను కోరారు. తద్వారా ప్రస్తుత సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల చిరునామాల తప్పులు సరిద్దిద్దడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. మళ్లించిన ఐజిఎస్‌టిని రికవరీ చేయడానికి, రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల టాక్స్ జ్యూడిరిక్షన్ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఢిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈ విషయంలో రెవెన్యూ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని కోరారు. పన్ను చెల్లింపుదారులపై మళ్లీ ఐజిఎస్‌టి చెల్లింపుతో భారం పడకుండా, ఇప్పటికే చెల్లించిన పిఒఎస్‌తో ఐజిఎస్‌టిని వాపసు చేయాలని కోరారు.
స్థానిక సంస్థల విధులకు సంబంధించి అందించిన స్వచ్ఛ పరికరాలకు రాయితీ మినహాయింపుల జాబితాను విస్తరించాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, జీఎస్టీ ఛైర్‌పర్సన్‌ను కోరినట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు, లేకుంటే అది స్థానిక సంస్థలపై భారం పడుతుందని వివరించారు. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో స్థానిక సంస్థలు ఉన్నాయని తెలియజేశారు. మినహాయింపు జాబితా విస్తరణపై పరిశీలన జరపడంతోపాటు వివరణాత్మక అధ్యయనం కోసం ఫిట్‌మెంట్ కమిటీకి పంపి, కొత్త ప్రతిపాదనను రూపొందించాలని సూచించారు. GST అప్పీలేట్ నిబంధనలకు సంబంధించిన విషయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో లేవనెత్తారు. ప్రతిపాదిత నిబంధనలు గజిబిజిగా ఆచరణాత్మకంగా లేవని చెప్పారు. ఇందుకు జీఎస్టీ కౌన్సిల్ చైర్ పర్సన్ సైతం అంగీకరించి అప్పిలేట్ నిబంధనలపై, అప్పిలేట్ ట్రిబ్యునల్ GoMకి అప్పగించడం జరిగింది. 2022 ఆగస్టు 1వ తేదీలోగా ప్రతిపాదనలు సమర్పించాలని GoMని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్ పర్సన్ సూచించింది.