KTR on EC: ఇదెక్కడి అరాచకం! తెలంగాణ గొంతుక కేసీఆర్ పైనే నిషేధమా? ఈసీ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
Telangana News: గత నెలలో సిరిసిల్లలో ఓ కార్యక్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ పై, ఆ పార్టీ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈసీకి నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వివరణ అనంతరం ఈసీ చర్యలు తీసుకుంది.
KTR responds on EC bans KCR from campaigning for 48 hours- హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. ఈసీ నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదెక్కడి అరాచకం...? ఏకంగా తెలంగాణ గొంతుక కేసీఆర్ పైనే నిషేధమా? అని ప్రశ్నించారు.
మోదీ విధ్వేష వ్యాఖ్యలు, రేవంత్ బూతులు ఈసీకి కనిపించవా?
ఇటీవల ఎన్నో సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ విధ్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా ? వేలాది మంది ఫిర్యాదులు చేసినా ప్రధాని మోదీపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా, అందుకే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలేదా అని అడిగారు.
#LokSabhaElections2024 | Election Commission of India bans former Telangana CM and BRS chief K Chandrashekar Rao from campaigning for 48 hours, starting 8 pm today, 1st May for making "derogatory and objectionable statements" against Congress in Sircilla. pic.twitter.com/lPPN75rhHT
— ANI (@ANI) May 1, 2024
బడే భాయ్ (ప్రధాని నరేంద్ర మోదీ).. చోటే భాయ్ (రేవంత్ రెడ్డి) కలిసి చేసిన కుట్ర ఇదన్నారు. కేసీఆర్ చేపట్టిన పోరుబాట చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వణుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల అహంకారానికి, సంస్థల దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన సమాధానం చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.
‘ఈసీ నా మీద 48 గంటలు నిషేధం విధించింది. ఇదే రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంట, గుడ్లు పీకేస్త అని అంటే ఈసీ ఆయనపై నిషేధం విధించలేదు. కానీ నా మీద ఆంక్షలు విధించింది. ఎన్నికల కమీషన్ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తరు’ అని మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
అసలేం జరిగిందంటే..
ఏప్రిల్ 5న సిరిసిల్లలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీతో పాటు, పార్టీ నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధం కేసీఆర్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరంజన్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఈసీ.. అనంతరం కేసీఆర్ నుంచి వివరణ తీసుకుంది. తెలంగాణ మాండలికాన్ని స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక పోయారని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ కేసీఆర్ వివరణతో ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని భావించి చర్యలు తీసుకుంది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు బీఆర్ఎస్ అధినేత ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశాలలో స్పష్టం చేసింది.