Hyderabad News: ఎల్బీనగర్ లో మరో వంతెన ప్రారంభం - ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే!
Hyderabad News: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయింది. అయితే వచ్చే వారమే దాన్ని ప్రారంభించి.. ట్రాఫిక్ కష్టాలను తీర్చబోతున్నారు.
Hyderabad News: హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రాటెజిక్ రెడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో మరో పని పూర్తయింది. 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వచ్చే దారిలో కూడలిలో కుడివైపు నిర్మితమైన వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మార్చి 18వ తేదీన తర్వాత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.
న్యూ ఇయర్ రోజు కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభం..
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క్ సమస్యలు, సిగ్నల్ లేని ప్రయాణం సాగించేలా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఐటీ కారిడార్ కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్ పాస్ లను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ కొత్త కారిడార్ తో ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసే వీలు ఉంటుంది. అయితే గచ్చిబౌలి జంక్షన్ నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆల్విన్ కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఈ ఫ్లైఓవర్ మీది నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించవచ్చు.
తొలిరోజు షేక్ పేట ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభత్వం వ్యూహాత్మంగా భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. అవన్నీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వరుసగా ఓపెనింగ్‌కు వస్తున్నాయి. కొత్త ఏడాది తొలి రోజున షేక్ పేట ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్ పేట్ , ఫిలింనగర్ జంక్షన్ ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దది.పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ ఫ్లైఓవర్ ఉంటుంది.
అత్యంత బిజీగా ఉండే ఎల్బీనగర్ ఫ్లైఓవర్ కూడా ప్రారంభం
ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్, 72 పియర్ క్యాప్స్, 440 పి.ఎస్.సి గడ్డర్స్,144 కాంపోసిట్ గ్రీడర్స్ ఏర్పాటు చేశారు. జనవరి మూడో నుంచి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అంతకంటే మూడు రోజుల ముందే మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో అత్యంత బిజీగా రూట్లలో ఒకటి ఎల్‌బినగర్ – చాంద్రాయణగుట్ట రూట్ . ఈ రూట్‌లోనే మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.