విదేశీ కరెన్సీ మార్పిడి మోసం, ఏడుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల 47 వేల నగదు, బజాజ్ డిస్కవరీ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
FOREIGN CURRENCY EXCHANGE FRAUD : విదేశీ కరెన్సీ ( FOREIGN CURRENCY ) మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా (INTERSTATE GANG )ను హైదరాబాద్ (Hyderabad) పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల 47 వేల నగదు, బజాజ్ డిస్కవరీ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ టీం, నార్త్ జోన్ బృందం సంయుక్తంగా ఆపరేషన్ చేసి, అంతరాష్ట్ర ముఠా అరెస్టు చేశాయి. ఏడుగుర్ని బోయిన్ పల్లి పోలీసులకు అప్పగించారు. కరెన్సీ మార్పిడి ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా విదేశీ కరెన్సీ మార్పిడి ఆఫర్‌తో సంప్రదించినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు.
నలుగురు ఢిల్లీ, ఇద్దరు బిహార్, ఒకరు యూపీ
మొహమ్మద్ ఇమ్రాన్ షేక్, వాహిద్ షేక్, హసీమ్ ఆలం, కుల్సుమ్, మహమ్మద్ అలీ షేక్, నిషా, షేక్ నిసార్ అహ్మద్ ముఠా సభ్యులు. వీరిలో నలుగురు ఢిల్లీ వాసులు కాగా, ఇద్దరు బీహార్, ఒకరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరిపై 379, 420 సెక్షన్ల కింద బోయిన్ పల్లి, తిరుమలగిరి పోలీసులు కేసులు పెట్టారు. పట్టుబడిన నిందితులు కరెన్సీ మార్పిడి కోసం దిర్హామ్ లతో వ్యాపారులను సంప్రదించారు. తక్కువ మార్పిడి రేటుతో బాధితులను ఆకర్షించిన తర్వాత ఇండియన్ కరెన్సీ తీసుకురావాలని వ్యాపారులను కోరారు. వారి నుంచి ఇండియన్ కరెన్సీ తీసుకున్నాక...దిర్హామ్‌ల కట్టను అందజేశారు. కొన్ని దిర్హామ్‌ల నోట్లు పైన ఉంచి బాధితులకు చూపించారు, మిగిలిన కట్టలను మడతపెట్టిన వార్తాపత్రికలతో నింపారు. బహిరంగ ప్రదేశంలో బ్యాగ్ ను తెరవవద్దని బాధితులను హెచ్చరించారు.
గతంలోనూ విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడ్డారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు..విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. బాన్స్ వాడకు చెందిన ఎజాజ్ ఖాన్ అనే వ్యక్తికి, బోధన్ లో రూ. 5లక్షల విలువైన విదేశీ కరెన్సీని రూ. 2.5 లక్షలకు ఇస్తామని నమ్మించారు. 2.5 లక్షలు తీసుకుని ఓ బ్యాగ్ అందజేసి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్ తెరిచి చూడటంతో, అందులో చిత్తు కాగితాలు, న్యూస్ పేపర్లు ఉండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.