Kanti Velugu: 50 రోజుల్లోనే కోటిమందికి కంటిపరీక్షలు: మంత్రి హరీష్ రావు
జనవరి 18, 2023న ప్రారంభమైన కంటివెలుగు రెండోవిడత 53లక్షల మంది మహిళలు, 47లక్షల మంది పురుషులు ఐ టెస్టులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో- విడత కార్యక్రమం మరో మైలురాయిని దాటింది. కోటి మందికి కంటివెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటివరకు 29 లక్షల మందికి కళ్లజోళ్లను ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సదాశివపేటలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కేక్ కట్ చేసి బెలూన్లను గాల్లో ఎగురవేసి, హర్షం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. అందరినీ పేరుపేరునా పలకరించారు. జనవరి 18, 2023న ప్రారంభమైన రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం కోటిపరీక్షలు పూర్తి చేసుకోవడంపై మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. కంటివెలుగు కోసం పనిచేసిన 1500 మందిని మంత్రి అభినందించారు.
53 లక్షల మంది మహిళలు, 47లక్షల మంది పురుషులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. 7వేల గ్రామపంచాయతీల్లో ఐ టెస్టులు చేశారు. 55 శాతం గ్రామాల్లో కంటి పరీక్షలు చేశారు. షార్ట్ సైటుతో ఇబ్బంది పడే 16లక్షల50 వేల మందికి అద్దాలు ఉచితంగా ఇచ్చారు. దూరపు చూపు సమస్య ఉన్న 12 లక్షల 50 వేల మందికి అద్దాలు పంపిణి చేశారు. సుమారు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి వెలుగు పథకం అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ రోజువారీ సమీక్ష చేస్తున్నారు. కోటి మార్క్ చేరడంలో కృషి చేసిన వైద్య సిబ్బందికి, మున్సిపల్, పంచాయతీ శాఖలు, జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.
ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్న పథకం- హరీష్ రావు
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో జనవరి 18న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నదని అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజల ఇబ్బందులు గమనించి, కంటిబాధల నుంచి విముక్తి కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం తీసుకువచ్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రపంచంలో కంటి వెలుగు తరహా కార్యక్రమం లేదన్నారు. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్న పథకం కంటి వెలుగు అన్నారాయన. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ సింగ్ ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారని హరీష్ రావు గుర్తుచేశారు.
త్వరలోనే అన్ని జిల్లాలకు న్యూట్రీషన్లు కిట్లు- మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి జిల్లాలో 84 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు, ప్రసవాలు అవుతున్నాయని వెల్లడించారు. గ్రామాల్లో పల్లె దవాఖానలు, మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామమని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాలకు న్యూట్రీషన్లు కిట్లు ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. T- డయాగ్నోసిస్ సెంటర్ల ద్వారా 57రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని అన్నారు. తెలంగాణ వైద్యరంగంలో మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం అధ్బుతమైన ప్రగతి సాధించిందని అన్నారు. ఈ ఏడాదిలోనే కొత్తగా 9 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు- శ్వేతా మహంతి , హెల్త్ కమిషనర్
ప్రపంచంలో కంటి వెలుగు తరహా కార్యక్రమం ఎక్కడా జరగలేదన్నారు హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి! కంటి వెలుగు బృందానికి అభినందనలు తెలిపారు. 1500 టీమ్స్ కష్టపడటంతో కోటి కంటిపరీక్షలు చేయగలిగామన్నారు. కంటి పరీక్షలు జరిగిన వెంటనే రీడింగ్ గ్లాసులు ఉచితంగా ఇచ్చామని శ్వేతామహంతి తెలిపారు. కంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ గ్లాసులు వేగంగా ఇచ్చామని కమిషన్ అన్నారు.