Hyderabad Rumble Strips : మహాప్రభో ఈ గీతలు తీసేయండి, వెన్నుపూసలు అరిగిపోతున్నాయ్ - రంబుల్ స్ట్రిప్స్ పై హైదరాబాదీల మొర!
Hyderabad Rumble Strips : హైదరాబాద్ వాహనదారులకు రంబుల్ స్ట్రిప్స్ సమస్య వచ్చిపడింది. వాహనాల స్పీడ్ ను కంట్రోల్ చేయడానికి, చోదకులను అలర్ట్ చేయడానికి ఏర్పాటుచేసిన స్ట్రిప్స్ ఇప్పుడు వెన్నుపూసలను కుదిపేస్తున్నాయి.
Hyderabad Rumble Strips : హైదరాబాద్ లో స్పీడ్ కంట్రోల్ లైన్స్ (రంబుల్ స్ట్రిప్స్) వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. నగరంలోని ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన ఈ లైన్స్ వాహనాలకే కాదు వాహనదారులకు కూడా ప్రమాదంగా మారాయి. తక్కువ మందంతో ఉన్నా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ గీతలపై వాహనాలు ప్రయాణించినప్పుడు వస్తున్న కుదుపులకు వాహనదారులకు ముఖ్యంగా వెన్నుముక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. స్పీడ్ కంట్రోల్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాల్లో వేసినప్పటికీ వీటి వల్ల వాహనదారులు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని తొలగించాలని వాహనదారులు జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ను టాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
రంబుల్ స్ట్రిప్స్, గల్లీల్లో స్పీడ్ బ్రేకర్స్ తో సమస్యలు
డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. స్పీ్డ్ కంట్రోల్ లైన్లతో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని తొలగించాలని కోరింది. జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్ ను టాగ్ చేసి ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు ఏ ఏరియాలో సమస్య ఉందో చెప్పండి తొలగిస్తామని రిప్లై ఇచ్చారు. ఈ లైన్లపై ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఓ హైదరాబాదీ ఇలా ట్వీట్ చేశారు. 'దయచేసి హైదరాబాద్ నగరంలో వేసిన లైన్లన్నిటిని వెంటనే తొలగించవలసిందిగా కోరుచున్నాం. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికర విషయం. దయచేసి సమీక్షించి లైన్లను వెంటనే తొలగించండి.' అని ట్వీట్ చేశారు. వీటితో హైదరాబాద్ గల్లీల్లో అనధికారంగా వేస్తున్న స్పీడ్ బ్రేకర్స్ తో కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ట్వీట్లు చేస్తున్నారు.
దయచేసి హైదరాబాద్ నగరంలో వేసిన లైన్లన్నిటిని వెంటనే తొలగించవలసిందిగా కోరుచున్నాము. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికర విషయం. దయచేసి సమీక్షించి లైన్లను వెంటనే తొలగించండి.@KTRBRS @MinisterKTR విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని కోరుచున్నాము
— DRIVERS WELFARE ASSOCIATION INDIA (@drivers_welfare) February 18, 2023
వాహనదారుల అవస్థలు
ఈ లైన్లపై మరో వ్యక్తి స్పందిస్తూ.. "చావు వస్తుంది ఈ గీతలతో, రోజు నడుమునొస్తుంది రా బాబు, మీకు చేతులు జోడించి మొక్కుతున్నా దయచేసి వెంటనే వీటిని తొలగించండి. వెన్నునొప్పి భరించలేక రోజు డోలో టాబ్లెట్ వేసుకుంటున్నాను. అన్న ఇది నిజం. ఇష్యూపై స్పందించి మీరు చాలా మంచి పని చేశారు. కేటీఆర్ సర్ దయచేసి చర్యలు తీసుకోండి" అని ట్వీట్ చేశారు.
స్పీడ్ కంట్రోల్ కోసమే కానీ
రంబుల్ స్ట్రిప్స్ ( స్లీపర్ లైన్‌లు లేదా అలర్ట్ స్ట్రిప్స్ )పై వాహనాలు ప్రయాణించినప్పుడు ఓ రకమైన శబ్దం వస్తుంది. దీంతో వాహనదారులు అలెర్ట్ అయి స్పీడ్ తగ్గించడం చేస్తారు. ఈ ఉద్దేశంతో వీటిని జాతీయ రహదారులు, వాహనాలు వేగంగా తిరిగే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. నగర రోడ్లపై అకస్మాత్తుగా రంబుల్ స్ట్రిప్స్ పెరగడం ప్రయాణికులకు సమస్యగా మారింది. ఓవర్ స్పీడ్‌ను నివారించడమే రంబుల స్ట్రిప్స్ ఉద్దేశం అయితే వీటి వల్ల వాహనదారులకు కొత్త చిక్కువచ్చింది. వాహనాలను వీటిపై పోనిచ్చినప్పుడు వస్తున్న జర్క్ లతో వాహనాలు తొందరగా రిపేర్ అవుతున్నాయని, అలాగే చోదకులకు వెన్నుముక సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. వీటి వల్ల వీపుపై మాత్రమే కాదు, మెడపై కూడా ప్రభావం ఉంటుందని వాహనదారులు అంటున్నారు. స్ట్రిప్స్ వల్ల కలిగే కుదుపులు చాలా తీవ్రమైన దీర్ఘకాలిక నొప్పికి దారితీయవచ్చని వైద్యులు అంటున్నారు. వృద్ధుల విషయంలో లేదా బలహీనమైన ఎముకలు ఉన్నవారిలో, కుదుపులు మరింత ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలాంటి స్ట్రిప్స్‌కి పదేపదే ప్రయాణించే వ్యక్తులతో సయాటిక్ పెయిన్ వస్తుందంటున్నారు.