Harish Rao Returns: లండన్ నుంచి తిరిగొచ్చిన హరీష్ రావు - కవితపై కీలక వ్యాఖ్యలు - కేసీఆర్‌తో భేటీ అయ్యే చాన్స్
Harish Rao: కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్ రావు అన్నారు. లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు.

Harish Rao On Kavitha : లండన్ నుంచి తిరిగి వచ్చిన హరీష్ రావు.. కవిత తనపై చేసిన ఆరోపణలపై ఆచితూచి స్పందించారు. తనపై కవిత చేసిన ఆరోపణలు... కొందరు నాయకులు, పార్టీలు గతంలోనే చేసినవేనని, వాటిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని, తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వడంతో కవిత పార్టీ నేతలైన హరీష్‌రావు, జే. సంతోష్ కుమార్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతికి వారే కారణం అన్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన కేసీఆర్.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన కవిత తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి వీరిద్దరూ కుట్ర చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు తన తండ్రి కేసీఆర్‌పై పడేలా చేశారని, హరీష్‌రావు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్‌రావు 25 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సొంతంగా డబ్బులు ఖర్చు చేశారని, పార్టీని విడగొట్టాలనే కుట్రలో భాగమని కవిత ఆరోపించారు.
కవిత ఆరోపణలతో సోషల్ మీడియాలో హరీష్ రావుపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అందుకే "నా రాజకీయ జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పోరాటం అందరికీ తెలుసు. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారు. ఆమె వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా" అని హరీష్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం తన బాధ్యత అని, రాష్ట్రాన్ని ద్రోహుల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హరీష్ రావు .. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ తో శనివారం సమావేశం అయ్యే అవకాసం ఉంది.
దేశానికి తిరిగి వచ్చిన హరీష్ రావు..
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 6, 2025
కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు..
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తం..
25ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నా..
కొన్ని రాజకీయ పార్టీలు కాావాలని కుట్రలు చేస్తున్నాయి pic.twitter.com/RerWuRa8Jj
కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్ పార్టీలో గందరగోళాన్ని సృష్టించాయి. హరీష్ వెనుక రేవంత్ ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. చెత్తగాళ్ల వెనుక తాను ఉండనన్నారు. ఈ వివాదం బీఆర్‌ఎస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టింది. కవిత తన రాజీనామా తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో చర్చించి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కవిత ఆరోపణలు చేసినప్పుడు హరీష్ రావు లండన్ లో ఉన్నారు. తిరిగి రావడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.





















