(Source: ECI | ABP NEWS)
Revanth Reddy: మీరు బాగా పని చేస్తే నేను రెండో సారి సీఎం అవుతా -గురుపూజోత్సవంలో టీచర్లకు రేవంత్ విజ్ఞప్తి
Telangana Bhavan: టీచర్లు బాగా పని చేస్తే రెండోసారి, మూడో సారి గెలుస్తానని సీఎం రేవంత్ అన్నారు. గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

CM Revanth : ముఖ్యమంత్రులు చాలా మంది రెవెన్యూ, ఆర్ధిక శాఖ, నీటిపారుదల శాఖలని వారి దగ్గర పెట్టుకుంటారు ..కానీ తాను విద్యా శాఖనునా దగ్గర పెట్టుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ రెండో సారి గెలవడానికి విద్యా సంస్కరణలే కారణం అని..తాను కూడా విద్యా సంస్కరణలు అమలు చేసి.. రెండో సారి గెలవాలన్న స్వార్థంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నాన్నారు. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై విమర్శలు చేస్తున్నారని.. విద్యా శాఖ ఇంకెవరికైనా ఇవ్వాలని విమర్శిస్తున్నారన్నారు. విద్యా శాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా .. పదేళ్లలో విద్యా శాఖ అస్తవ్యస్తమైందన్నారు.
కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి పదేళ్లు గడిచింది.. మరి అది అమలు జరిగిందా అనేది మీరే ఆలోచించుకోవాలని టీచర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతీ పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనన్నారు. పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదు ..2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు ..మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామన్నారు. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నించారన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సేవలు అవసరమని టీచర్లకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 10 వేల పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.. మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించామని.. ప్రతీ ఏటా 130 కోట్లు స్కూల్స్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. చదువొక్కటే పేదల తల రాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుందన్నారు.
టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించండి..పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుదామని ప్రతినబూనుదామని.. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దుదామన్నారు. తెలంగాణకు ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ అవసరం .. ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు ఓకే కమిటీని నియమించామని తెలిపారు. పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చునని.. విద్య విషయంలోనూ పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
వరల్డ్ బెస్ట్ మోడల్ గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నాం ..నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ గా ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు ఆ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నా మీరు, నేను కలిసి తెలంగాణను పునర్నిర్మించుకుందాం.. ఇందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులతో కలిసి రేవంత్ భోజనాలు చేశారు.





















