Harish Rao Comments On KCR: బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బిగ్ బాస్, కవిత ఆరోపణల తరువాత తొలిసారి స్పందించిన హరీష్ రావు
Harish Rao About KCR | బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ అధినేత కేసీఆర్ అని, ఆయన నుంచి తాను రాజకీయాలు, ప్రజలకు మేలు చేయడం నేర్చుకున్నానని హరీష్ రావు అన్నారు. కవిత ఆరోపణల తరువాత తొలిసారి స్పందించారు.

BRS Politics | లండన్: బీఆర్‌ఎస్ పార్టీకి అధినేత కేసీఆరే సుప్రీం అని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) స్పష్టం చేశారు. ఇటీవల పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలు చేసి మొదట తనను పార్టీ నుంచి బయటకు పంపారని, తరువాత వారి టార్గెట్ కేటీఆర్, ఆపై కేసీఆర్ అని కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. అయితే ఆ సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు విదేశాలలో ఉన్నారు. లండన్ లో ఉన్న హరీష్ రావు అక్కడ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం (సెప్టెంబర్ 5న) నిర్వహించారు.
కలిసికట్టుగా పనిచేయడం కేసీఆర్ నేర్పించారు..
కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ బిగ్ బాస్ అని, పార్టీకి ఆయనే సుప్రీం అన్నారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని, కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవచేయడమే కేసీఆర్ తనకు నేర్పించారని స్పష్టం చేశారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందని, తనది అదే దారి అని క్లారిటీ ఇచ్చారు. అయితే కవిత చేసిన కుట్ర ఆరోపణలపై నేరుగా వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కవిత చేసిన ఆరోపణలపై స్పందించాలని లండన్‌లో మీడియా హరీష్ రావును కోరగా అదంతా ఇండియాలోనే చూసుకుందాం అని ఆయన సన్నిహితులు బదులిచ్చారు.
తెలంగాణలో లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని జిల్లాల్లో తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగితే వాటిని మరమ్మతులు చేపించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి, వారిపై సైతం కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు కనిపిస్తుందన్నారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ అంతగా ఉండదన్న హరీష్ రావు.. బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోయడంతో రైతులకు సాగునీరు అందుతుందన్నారు. ముందుగానే నీటిని ఎత్తిపోసుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని, వారికి కనీసం యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని విమర్శించారు.
హైడ్రా వ్యవస్థలో హైదరాబాద్‌లో కుప్పకూలిన రియల్ ఎస్టేట్..
‘కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎన్నారైలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని కాంగ్రెస్ పాలనే అందుకు కారణం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయం. ప్రభుత్వం మారిన తరువాత ఏడాదిలోనే రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నో చిన్న ప్రాజెక్టుల సమాహారం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి వాటిలో ఒకటైన మేడిగడ్డలో ఉన్న ఏడు బ్లాకులలో ఒక బ్లాకులో 3 పిల్లర్లు కుంగాయి. కానీ వాళ్లు మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయిందని దుష్ప్రచారం చేశారు. రైతులకు సాగునీరు అందించడం లేదు, యూరియా కొరతను సైతం తీర్చలేక బీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారని’ కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు మండిపడ్డారు.
గూగుల్‌లో సెర్చ్ చేసినా తెలంగాణనే నెంబర్ వన్..
హరీష్ రావు ఇంకా మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాల సాధనలో కీలక పాత్ర పోషించింది. కొన్ని రోజుల క్రితం దేశంలో "బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది" అనే మాటలు వినిపించేవి. కానీ కేసీఆర్ పాలనతో ఇప్పుడు "తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది" అనే స్థితికి చేరుకుంది. గత 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని దేశం మొత్తమూ గుర్తించింది. గూగుల్ లో సెర్చ్ చేసినా, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ లో దేశంలో అగ్రగామిగా ఉంది. పర్ క్యాపిటా పవర్ వాడకం విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) వృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో కూడా ఏ రాష్ట్రం లేదు.
కేసీఆర్ ప్రతిజ్ఞ చేసినట్లు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ముందు కేవలం ఆత్మవిశ్వాసంతో "ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాను" అని చెప్పారు, అదే సాక్షాత్కారం అయ్యింది. "మిషన్ భగీరథ" కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించారు. ఈ కార్యక్రమం దేశంలో అన్ని రాష్ట్రాల దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ రాకముందు, హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ కు పవర్ హాలిడేస్ ఇచ్చేవారు, గ్రామీణ ప్రాంతాలలో 6 గంటల నుండి 8 గంటల వరకు పవర్ కట్ ఉండేది. కానీ కేసీఆర్ పాలనలో, ఒక సంవత్సరంలో 24 గంటల నాణ్యమైన కరెంటు అందించడమే కాకుండా, పవర్ పై సమీక్షలు నిర్వహించి, సమయానికి కరెంటు కొనుగోలు చేస్తారు.
మూడేళ్లలో మిషన్ భగీరథ పూర్తి..
మిషన్ భగీరథ ప్రోగ్రామ్‌ని ఆదర్శంగా తీసుకొని, కేంద్ర ప్రభుత్వం "సర్దార్ కోచలాని" కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ, మిషన్ భగీరథ మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశాం, కాగా, "హర్ ఘర్ జల్" పథకం దేశంలో ఇంకా పూర్తవ్వలేదు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం ప్రారంభించి, దాదాపు 30 వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిజిస్టర్ చేశారు. ఈ కార్యక్రమం దేశంలోని దృష్టిని ఆకర్షించింది, అంతేకాక, కేంద్ర ప్రభుత్వం "అమృత సరోవర్" కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణకు అధికారులను పంపించింది.
తెలంగాణను చూసే పీఎం కిసాన్ పథకం..
రైతుల సంక్షేమం కోసం, కేసీఆర్ "రైతుబంధు" అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయం పట్ల అన్యాయానికి గురైన రైతులకు, ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మార్చారు. 2014 నాటి తెలంగాణ వ్యవస్థలో, ఎక్కడ చూసినా 2-3 లక్షల ఎకరాల వ్యవసాయం మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు, రాష్ట్రంలో 30,000 నుండి 50,000 ఎకరాల వ్యవసాయం సాధ్యం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రభావాన్ని అంగీకరించి, "పీఎం కిసాన్" పథకాన్ని ప్రారంభించింది.
ఇది మాత్రమే కాదు, విద్యుత్ వినియోగం, రోడ్డు రవాణా, ఇతర అన్ని కార్యక్రమాలలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 7.7% గ్రీన్ కవర్ పెంచి, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక, ఆవిష్కరణ, మరియు పర్యావరణ పరిరక్షణలో దేశానికి ముందంజ వేసింది.






















