Siddipet Fire: సిద్దిపేటలో తుపాకీ కాల్పుల కలకలం.. వ్యక్తి తొడపై కాల్చి, డబ్బుల బ్యాగుతో పరార్
ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్‌పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్‌తో కాల్చారు. మరో వ్యక్తి కారు డోర్లు తీసి రూ.43 లక్షల నగదు తీసుకుని పారిపోయారు.
సిద్దిపేటలో తుపాకీ కాల్పులు స్థానికుల్ని బెంబేలెత్తించాయి. సిద్దిపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఓ ఆగంతుకుడు జనాన్ని ఈ భయానికి గురి చేశాడు. అంతేకాదు, ఆ తుపాకీ కాల్పుల అనంతరం మరో వ్యక్తికి చెందిన భారీ సొత్తును ఎత్తుకుపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. తుపాకీ కాల్పులకు ఎవరు పాల్పడ్డారనే దానిపై ఆరా తీస్తున్నారు.
రేపటి నుంచి (ఫిబ్రవరి 1) తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి వస్తుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆస్తుల కొనుగోలు దారులు ముందస్తుగానే తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చేర్యాల ప్రాంతానికి చెందిన నర్సయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా తన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వచ్చారు. సిద్దిపేటలోని ఓ ప్లాట్ లావాదేవీ కోసం నర్సయ్య, ఆయన డ్రైవర్ పర్శరాములు కారులో వచ్చారు. దాదాపు రూ.48.5 లక్షల నగదు వారి వద్ద ఉంది. ప్లాటు విక్రయించగా వచ్చిన డబ్బులు రూ.43 లక్షలు కొనుగోలు దారు నుంచి తీసుకొని డ్రైవర్‌కు ఇచ్చి కారులో పెట్టాలని నర్సయ్య చెప్పారు.
ఈ లోపు సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి వెళ్లాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్‌పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్‌తో కాల్చారు. మరో వ్యక్తి కారు డోర్లు తీసి రూ.43 లక్షల నగదు తీసుకుని పారిపోయారు. కాగా.. నిందితులు గన్‌ను కారులోనే వదిలి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆగంతుకుల గురించి ఆరా తీస్తున్నారు. పూర్వం ప్లాటు క్రయ విక్రయాల్లో విభేదాలు వచ్చినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో బాధితులను ప్రశ్నిస్తున్నారు.
ఈ దుండగులు కారును ఫాలో అయి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నంబర్ ప్లేటులేని బైక్‌పై వచ్చారు. కారు అద్దాన్ని పగులగొట్టి.. డ్రైవర్ పరుశురామ్ కాలిపై కాల్పులు జరిపాడు. మరో వ్యక్తి అవతలి వైపు నుంచి వచ్చి నగదు ఉన్న బ్యాగును అపహరించారు. అనంతరం తుపాకీని అక్కడే వదిలిపెట్టి బైక్‌పై పారిపోయారు. ఘటనాస్థలంలో బుల్లెట్లను, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దుండగులు కంట్రీమేడ్ గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు.