Family Survey: తెలంగాణలో సమగ్ర సర్వే, కుల గణన చేసేది వీరే - మంచి వేతనం ఇస్తామన్న భట్టి విక్రమార్క
Caste Census in Telangana News | తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన ఉపాధ్యాయులు చేస్తారని రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లు, మంత్రులకు తెలిపారు.
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కుల గణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్కూలు టైమింగ్స్ పూర్తయ్యాక ఉపాధ్యాయులు రోజుకు 5 నుంచి 7 ఇళ్లల్లో సమగ్ర సర్వే చేయనున్నారు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వివరాలు సేకరించడం పై జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఉపాధ్యాయులతోనే సమగ్ర సర్వే.. భట్టి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనను సమర్థవంతంగా నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. సమగ్ర ఇంటింటి సర్వే పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరుస రివ్యూలు చేస్తున్నారు. కులగణన కోసం స్కూల్ టైమింగ్ ముగిసిన తరువాత ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లను భట్టి విక్రమార్క ఆదేశించారు. పాఠశాల సమయం ముగిసిన తరువాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 5 నుంచి 7 ఇళ్లలో వివరాలను సేకరించేలా ప్లాన్ చేయాలని సూచించారు. సమగ్ర సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు తగిన వేతనం ఇస్తామన్నారు. వారు ప్రజల ఇంటికి వెళ్లి అడగాల్సిన 50 ప్రశ్నలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా సూపర్ వైజర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తగిన సూచనలు చేయాలన్నారు.
నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే మొదలవుతుంది. గతంలో కేసీఆర్ హయాంలో తెలంగాణలో సమగ్ర కుటుంబసర్వే నిర్వహించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ, నిజమాబాద్ లో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఇంటింటి సర్వే చేపడుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒక్కో ఇంటికి వెళ్లి దాదాపు 50 ప్రశ్నలు అడిగి పూర్తి వివరాలు సేకరిస్తారు. దీన్ని సమగ్ర, సామాజిక, ఆర్థిక సర్వేగా పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో రెండు నుంచి మూడు వారాల్లో సర్వే పూర్తి చేస్తారు. ఆ వివరాలు వారం నుంచి పది రోజుల్లో కంప్యూటరీకరణ చేయనున్నారు.
Also Read: Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో