Huzurabad By Election : రేవంత్ రెడ్డిని కలిశాను... తప్పేంటి ? కేటీఆర్‌కు ఈటల కౌంటర్ !
రేవంత్ రెడ్డిని కలిసిన మాట నిజమేనని ఈటల రాజేందర్ అంగీకరించారు. బీజేపీలో చేరక ముందు అన్ని పార్టీల నేతలను కలిశానని అంటున్నారు. అందులో తప్పేముందని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
హుజురాబాద్ ఉపఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఈటల రాజేందర్ - రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని కేటీఆర్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కాదని చెపితే తాను ఫోటోలు బయటపెడతానని కేటీఆర్ చాలెంజ్ చేశారు. దీనిపై హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్ రెడ్డిని కలిశానని అయితే ఏంటని ప్రశ్నించారు. అయితే రేవంత్ రెడ్డిని కలిసింది బీజేపీలో చేరిన తర్వాత కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత చాలా మందిని కలిశానని అప్పుడే.. రేవంత్ రెడ్డిని కూడా కలిశానని స్పష్టం చేశారు.
ఈటల - రేవంత్ రెడ్డి రహస్య భేటీ అని అదేదే తప్పుడు పని అన్నట్లుగా చెబుతున్నారని.. రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరి మద్దతు కోరలేదా.. అభివృద్ధి కోసం చాలా మందిని కలుస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఇతర నేతలతో సంబంధాలు కొనసాగించలేకపోయానని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలోనే ఎక్కువగా సమావేశం అయ్యారు. మల్లు భట్టివిక్రమార్క వంటివారితో నేరుగానే సమావేశమయ్యారు. అయితే రేవంత్ రెడ్డితో మాత్రం మీడియాకు తెలియకుండా సమావేశమయ్యారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. అప్పటికి రేవంత్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌గా ప్రకటించలేదు.
Also Read : డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
అప్పట్లో ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ పార్టీలో ఉన్న అనిశ్చితి కారణంగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడం వల్ల .. టీఆర్ఎస్ అధికార దాడుల నుంచి రక్షణ ఉంటుందన్న కారణంతో బీజేపీలో చేరినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేశాయి. అయితే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయిన తర్వాత రాజకీయం మారిపోయింది. దీంతో ఈటలతో రేవంత్ భేటీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !
రేవంత్ - ఈటల కలిశారని అందుకే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా బీజేపీ, కాంగ్రెస్ కలిపి పోటీ చేయలేదని.. ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో ఈటల గెలుపును ఎవరూ ఆపలేరుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మరో నేత జితేందర్ రెడ్డి విమర్శించారు.