Huzurabad: డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
వీణవంక మండలంలోని రెడ్డిపల్లి, కిష్టంపేట, ఘన్ముక్కుల, బ్రహ్మణపల్లి, రామక్రిష్ణాపూర్ గ్రామాల మీదుగా ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం హోరా హోరీ ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యా్హ్నం కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళిత బంధును ఎన్నికల సంఘం నిలిపివేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ పథకాన్ని తాము ఆపుతున్నట్టు దుష్ర్పచారం చేస్తున్నారని ఈటల అన్నారు. కేసీఆర్ మాట తప్పను అని అన్నారని.. అదే జరిగితే తన తల నరుక్కుంటానని అనేవారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. దళితులకు సబ్సీడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక దెబ్బకే ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ స్థలాలు ఉన్నవాళ్ళకీ ఇండ్లు కట్టుకునే జీవో వస్తున్నాయని అన్నారు. ఎన్నికలు ఉంటేనే హమీలు, చెక్కులు ఇస్తారని.. ఇది కేసీఆర్ నైజమని అన్నారు.
‘‘బడ్జెట్‌లో ఐదు పైసల బిల్లు కూడా పెట్టకుండా దళిత బంధు ఎలా వచ్చింది? ఓట్ల కోసమే ఈ పథకం తెచ్చారు’’ అని ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ స్కీంను ఆపాలని తాను లేఖ రాసినట్లు దొంగ లేఖలు సృష్టించారని, ఎన్నికల కమిషన్ కూడా ఈ దొంగ లేఖలను ఖండించిందని, ఇప్పుడు తన వల్లనే దళిత బంధు ఆగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారని ఈటల విరుచుకుపడ్డారు. దళిత బంధు తాను ఆపినట్లు నిరూపిస్తే తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వస్తానని సవాల్ విసిరారు. అన్ని కులాల్లోని పేదలకు రూ.10 లక్షలు ఇవ్వాలని తాను కొట్లాడతానని, కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అనంతరం వీణవంక మండలంలోని రెడ్డిపల్లి, కిష్టంపేట, ఘన్ముక్కుల, బ్రహ్మణపల్లి, రామక్రిష్ణాపూర్ గ్రామాల మీదుగా ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, డబ్బు పంపిణీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతల బృందంతో ఆయన బుధవారం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తమకు నమ్మకం పోయిందని, శాంతియుత వాతావరణంలో ఉపఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఎన్నికల పరిశీలకులను పంపించాలని కోరామని తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు కేంద్ర బలగాలను మొహరించాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఎల్రక్టానిక్ మోడ్‌లో నగదు బదిలీని ఆపాలని కోరినట్లు తెలిపారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
Also Read: చాక్లెట్ ఇస్తానంటే సరే అంకూల్ అంటూ నమ్మి వెళ్లింది నాలుగేళ్ల పాప.. పక్కకు తీసుకెళ్లిన అతడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి