KTR Plan : బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
హుజురాబాద్‌లో ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఉందని చెప్పేందుకు కేటీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది రాజకీయ వ్యూహమే. అయితే దీని వల్ల ఈటలకే మేలు జరుగుతుందా.? టీఆర్ఎస్‌కా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల తీరు తెన్నులను మార్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో తెర వెనుక రాజకీయాలు కూడా జరుగుతున్నాయన్న బలమైన ప్రచారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాజకీయాలు ఎప్పుడూ బయటకు రావు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట‌్ కేటీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికల విషయంలో ఈ తెర వెనుక రాజకీయాల్ని హైలెట్ చేయాలని అనుకుంటున్నారు. పదే పదే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ప్లీనరీ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో ఇంకో అడుగు ముందుకేసి ఈటల - రేవంత్ రెడ్డి రహస్య భేటీ కూడా జరిపారని ప్రకటించేశారు. దీంకో కేటీఆర్ ప్రచారం వల్ల ఎవరికి మేలు అనే చర్చ ప్రారంభమయింది.
Also Read : ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్
కాంగ్రెస్ -ఈటల ఒక్కటేనని కేటీఆర్ అంత బలంగా ఎందుకు నమ్ముతున్నారు ?
మూడు రోజుల కింద మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ ఎన్నికల తర్వాత ఈటల ాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పారు. ఈటలతో పాటు ఆయనను బీజేపీలో చేర్చడానికి కృషి చేసిన మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్‌లోనే చేరుతారని ప్రకటించారు. దీనికి సాక్ష్యంగా కేటీఆర్ కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కే మద్దతు పలికారు. నిజానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేరు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ ఏదయితే అందులో చేరాలని వెయిట్ చేస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గుతున్నారు. కానీ ఇంకా ఆ పార్టీలో చేరలేదు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ఈటలకు మద్దతు ప్రకటించడం ఆశ్చర్యకర పరిణామంగా మారింది. ఈ కారణాల వల్ల ఈటల రాజేందర్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరుతారని కేటీఆర్ బలంగా నమ్ముతున్నట్లుగా ఉంది. ఈటల - రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని ఆయనకు ఇంటలిజెన్స్ సమాచారం వచ్చిందేమో కానీ ఆయన నేరుగానే చెబుతున్నారు. ఇది సహజంగానే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
కేటీఆర్ ప్రకటనతో కాంగ్రెస్ ఫ్యాన్స్ టీఆర్ఎస్ వైపు చూస్తారా !?
ప్రస్తుతం హుజురాబాద్‌లో ఎన్నికలు ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోలరైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా పోటీ చేస్తోంది. ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ కూడా పరోక్షంగానే అంగీకరిస్తున్నారు. ఇంటికొక్క ఓటు అని ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన తమ బలం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అందుకే వ్యూహాత్మకంగా ఈటల - కాంగ్రెస్ ఒక్కటేనని చెబుతున్నారు. కాంగ్రెస్ ఓటర్లు సంప్రదాయంగా బీజేపీకి బద్ద వ్యతిరేకులు, కలలో కూడా కమలం గుర్తుపై ఓటేయడానికి వారికి మనసొప్పదని వారికి టీఆర్ఎస్‌నే ఆప్షన్ ఉంటుందుని కేటీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.
Also Read : కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
కేటీఆర్ ప్రచారం తమకే కలిసి వస్తుందన్న నమ్మకంతో గుంభనంగా ఈటల వర్గం !
కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై ఈటల వర్గం పెద్దగా స్పందించడం లేదు. కేటీఆర్ ఓ రకంగా తమకు మేలు చేస్తున్నారని వారు నమ్ముతున్నారు. ఎన్నికల్లో గెలిచి ఈటల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఓటర్లు ఈటలకే ఓటు వేస్తారన్న అంచనాలను వినిపిస్తున్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికి ఈటలను అభ్యర్థిగా చూస్తున్నారు కానీ.. బీజేపీ అభ్యర్థిగా చూడటం లేదు. ఈటల రాజేందర్ తనను తాను బీజేపీ అభ్యర్థిగా ఎక్కువగా చెప్పుకోవడం లేదు. అక్కడ ఈటల గుర్తు కమలం అని ఉంది కానీ బీజేపీ అభ్యర్థి ఈటల అని భావించడం లేదు. అందుకే కేటీఆర్ ప్రచారం వల్ల కాంగ్రెస్ ఓటర్లు తమకే ఓటు వేస్తారని నమ్మకంతో ఉన్నారు. ఒక వేళ అదే జరిగితే టీఆర్ఎస్‌ది వ్యూహాత్మక తప్పిదం అవుతుంది.
Also Read : బహిరంగసభనా ? రోడ్ షోనా ? కేసీఆర్ ప్రచారంపై డైలమా ?
నిజంగానే ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్తారా ?
ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్ని కలిశారు. కానీ ఆయన పార్టీలో చేరలేదు. చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఖరారు చేయలేదు. ఆలస్యం అయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపుల కారణంగా ఆయన ఇబ్బందిపడతానేమో అన్న అంచనాతో బీజేపీలో చేరారని అంటున్నారు. అదే నిజమైతే.. ఎన్నికల తర్వాత ఈటల కీలకమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !