Huzurabad By Poll: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!
హుజూరాబాద్ లో విజయం సాధించేదెవరు... సానుభూతిని నమ్ముకున్న ఈటల రాజేందర్, అభివృద్ధిని నమ్ముకున్న టీఆర్ఎస్, వీరిద్దరూ ఒక్కటే అంటున్న హస్తం. గెలుపుకోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుకుంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ విమర్శలకు పదునుపెట్టాయి. ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ప్రజల మనన్నల కోసం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా పోటీలో నిలిచిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ, విపక్ష బీజేపీలు ఒకరిపై ఒక్కరు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. సానుబూతి తమను గట్టెక్కిస్తుందని ఒకరు.. అభివృద్ధికే అందలం కడతారని మరొక్కరు ప్రచారం సాగిస్తుండగా ఇందుకు బిన్నంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్ బీజేపీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ప్రజలు ఈ విషయం అర్థం చేసుకుని తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది.
సానుభూతి గట్టెక్కించేనా..?
హుజూరాబాద్ ఎన్నికలకు ప్రధాన కారణం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం. నాలుగు నెలల క్రితం వరకు టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రిగా చెలామణి అయిన ఈటల రాజేందర్ అప్పట్లో తరుచూ కేసీఆర్‌పైనే విమర్శనాస్త్రాలు సందించి పార్టీని, కేసీఆర్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. అయితే గత రెండేళ్లుగా అదును కోసం ఎదురుచూసిన కేసీఆర్ ఎట్టకేలకు ఈటల అవినీతిని అస్త్రంగా చేసుకుని అతనిపై కేసులను నమోదు చేయించారు. ఈటెల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న తనను కేసీఆర్ గెంటేశాడని, కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు తనకు సహకరించాలని ఈటల ప్రచారంలో ప్రధానాస్త్రంగా మలుచుకున్నారు. దీంతోపాటు టీఆర్‌ఎస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తుందని, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లేదని ప్రచారం సాగిస్తున్నారు. దీంతోపాటు తన రాజీనామా వల్లే దళితబందు పథకం వచ్చిందని, హుజూరాబాద్‌కు వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని పేర్కొంటూ సానూభూతే ప్రధానాస్త్రంగా ముందుకు సాగుతున్నారు. తనకు ప్రజలు న్యాయం చేయాలని కోరుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఈటల తరపున ప్రచారం జోరుగా కొనసాగిస్తోంది.
Also Read: ఎంతటివారైనా ఉపేక్షించవద్దు.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్: సీఎం కేసీఆర్
అభివృద్ధే మంత్రంగా..
హుజూరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంది. టీఆర్ఎస్ అభివృద్దే మంత్రంగా తాము గట్టెక్కుతామని భావిస్తోంది. ఇప్పటికే దళిత బంధు పేరుతో ఎస్సీల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేయగా నియోజకవర్గంలోని పెండింగ్ పనులకు నిధులు ఏర్పాటు చేసి హడావుడిగా శంకుస్థాపనలు సైతం చేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తోపాటు డజను మంది ఎమ్మెల్యేలు, నేతలు రెండు నెలలుగా నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. దీంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, గ్యాస్, పెట్రోల్ రేట్ పెరిగాయని చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలకు పాల్పడుతున్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే సభ నిర్వహించిన కేసీఆర్ ప్రచారం ముగింపు రోజైన 27న తిరిగి మరోమారు నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలున్నాయి. అయితే టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రం తమను గెలిపిస్తుందని చెబుతున్నారు.
Also Read: ఎంతటివారైనా ఉపేక్షించవద్దు.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్: సీఎం కేసీఆర్
ఇద్దరూ ఒక్కటే అంటూ ‘హస్త’రాగం
టీఆర్‌ఎస్, బీజేపీలు సానుభూతి, అభివృద్ధి అంటూ ప్రచారం సాగిస్తుండగా విద్యార్థి సంఘం నాయకుడైన బల్మూరు వెంకట్‌ను బరిలోకి దించిన కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనని చెబుతూ ప్రచారం సాగిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో తీవ్ర జాప్యం చేసిన కాంగ్రెస్ ఆ తర్వాత మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించి టీఆర్‌ఎస్, బీజేపీలు ఈ ఉపఎన్నికలకు కారణమయ్యారని, అందువల్ల ఆ పార్టీలకు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ కోరుతుంది. ఇప్పటికే ఒక దఫా నియోజకవర్గంలో పర్యటన చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయనే విషయంపై ప్రచారంలో ఫోకస్ చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తే ఈటల రాజీనామా చేశాడే ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అతనిని బయటికి పంపారా..? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం రెండు పార్టీలు అంతర్గతంగా ఒక్కటై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కాంగ్రెస్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధు యాష్కీ, తోపాటు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సీతక్కలు నియోజకవర్గంలో ఉండి ప్రచారం సాగిస్తున్నారు.
Also Read : డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
అయితే హుజరాబాద్ లో మాత్రం నేతలు ఎక్కని గడపాలేదు, దిగని గడపాలేదు. ఐదు నెలల పైగా ఒకే నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాబోలు. మరోవైపు నేతల ప్రచారంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం మరింత చైతన్యవంతులయ్యేరనే విషయం మాత్రం వాస్తవం. మూడు ప్రధాన పార్టీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ ఉప ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు కోసం పరితపిస్తున్నారు. మరి హుజూరాబాద్ ప్రజలు ఎవరికి జిందాబాద్ కొడతారో, 30న ఏ పార్టీకి ఓటేసి కీలక ఎన్నికల్లో ఎవర్ని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.
Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి