Mahesh Bank ED Raids : ఆ హైదరాబాద్ బ్యాంక్‌లో రూ. 300 కోట్ల గోల్ మాల్ - ఈడీ సోదాలు
Hyderabad : మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు వందల కోట్ల నగదు గోల్ మాల్ జరిగినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు.
Mahesh Co Operative Bank : హైదరబాద్‌లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దా సోదాలు చేపట్టారు. బ్యాంకుకు సంబంధించిన ఆరు కీలక ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న ఇళ్లల్లో మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్, సీఈవో, డైరెక్టర్ల ఇళ్లతో పాటు సోలిపురం వెంకట్ రెడ్డి ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ల మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.300 కోట్ల నిధుల గోల్ మాల్‌పై హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అనర్హులకు రుణాలు ఇచ్చి.. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
భారీగా అనర్హులకు రుణాలు
మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తోంది. అయితే అయితే బ్యాంకులో రుణాల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కంపెనీలోని వాటాదారులు ఇతరులతో కుమ్మక్కయి... పెద్ద ఎత్తున రుణాలను అనర్హులకు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ లో కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై ఈడీ సమాచారం వెళ్లడంతో సోదాలు నిర్వహించారు.
గతంలో భారీ సైబర్ దాడితో మహేష్ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి
మహేష్ బ్యాంక్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆ సంస్థ సైబర్ సెక్యూరిటీని పట్టించుకోలేదు. ఈ కారణంగా సైబర్ దాడులు జరిగాయి. నైజీరియా నుంచి సైబర్ దాడులు జరిగి నడబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ సైబర్ పోలీసులు అసలు విషయం తేల్చేశారు. మహేశ్ బ్యాంక్ యాజమాన్యం సైబర్ సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేసిందని, అందువల్లే సర్వర్ హ్యాక్ చేసి నగదు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫర్ జరిగిందని దర్యాప్తులో తేలింది. నైజీరియన్ హ్యాకర్లు మొదట బ్యాంకు ఉద్యోగులకు మెయిల్స్, మెస్సేజ్ లు పంపి తరువాత బ్యాంకు సర్వర్ లోకి చొరబడి పలు ఖాతాలకు కొల్లగొట్టిన నగదును ట్రాన్స్ ఫర్ చేశారు.
బ్యాంక్ లైసెన్స్ రద్దు చేాయలని సిఫారసు చేసిన సైబర్ పోలీసులు
హైదరాబాద్ సైబర్ పోలీసులు నేరుగా ఆర్బీఐ గవర్నర్ కే ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీని పట్టించుకోని బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సైతం ఆర్బీఐకి సూచించారు. అయితే చట్టపరంగా ఒక బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాదని.. మహేశ్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా డిపాజిటర్లు, ఖాతాదారుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉందని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని గట్టిగా మహేశ్ బ్యాంకు నిర్వాహకులను ఆర్బీఐ మందలించింది. ఆ తర్వాత ఇప్పుడు రుణాల స్కామ్ వెలుగు చూడటం సంచలనంగా మారింది. ఈడీ సోదాలు తర్వాత అసలు విషయం ప్రకటించే అవకాశం ఉంది.