New Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డులు పంపిణీపై కీలక అప్ డేట్, ఎన్ని లక్షల కుటుంబాలు ఎంపిక చేశారంటే
Telangan News: తెలంగాణలో కొత్త రేషన్‌కార్డులు పంపిణీకి మార్గం సుగమం. జనవరి 26 నుంచి 6.68 లక్షల కుటుంబాలకు అందజేయనున్నారు. కుటుంబ సమగ్ర సర్వే ద్వారా సేకరించిన వివరాలు ద్వారా అర్హులు గుర్తింపు

Ration Cards: తెలంగాణ(Telangana)లో పేద ప్రజల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడనుంది. దాదాపు దశాబ్దకాలం తర్వాత తెలంగాణలో కొత్త రేషన్‌కార్డు(Ration Cards)లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పౌరసరఫరాలశాఖ అనేక వడపోతల అనంతరం జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం నుంచి ఏ చిన్న పథకం పొందాలన్నా ముందుగా అడిగేది రేషన్‌కార్డే. పేదలకు గుర్తింపు కార్డుగా మారిన రేషన్ కార్డులను దాదాపు దశాబ్దకాలం పాటు కేసీఆర్(KCR) సర్కార్ అందజేయలేదు.ఎప్పుడు అడిగినా ఇదిగో, అదిగో అనడమే తప్ప...తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారే ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో పేదలకు రేషన్‌కార్డులు అందలేదు. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్‌కార్డు(Ration Cards) లేక ఎన్నో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు.ఆఖరికి ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి కూడా రేషన్‌కార్డే ప్రమాణికంగా ఉండటంతో పేదప్రజలు రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ పేదల నిరీక్షణ ఫలించింది.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ (Congress)సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోంది. రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకురానున్న ఐదు గ్యారెంటీలు అమలు చేయాలంటే ముందుగా అర్హులను గుర్తించాలి. ఆవిధమైన అర్హుల గుర్తింపు కోసమే ముందుగా రేషన్‌కార్డులను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇటీవలే నిర్వహించిన ఇంటింటి సర్వేతోపాటు...ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం వివరాలు సేకరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హమైనవిగా గుర్తించారు. ఈ జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించి ఈనెల 20 నుంచి 24 వరకు గ్రామసభలు, బస్తీ సభలు నిర్వహించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారు చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు ఖారారు చేసిన జాబితా ప్రకారం పౌరసరఫరాల (Civil Supplies)శాఖ కార్డులను మంజూరు చేయనుంది. జనవరి 26వ తేదీ నుంచి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
అర్హుల ఎంపిక
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదుగ్యారెంటీలైన ఆరోగ్యశ్రీ(Aarogyasri), 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Power), సబ్సిడీ గ్యాస్, ఫీజు రియింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డే ఆధారం. అందుకే రేషన్‌కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా....ఇప్పుడు మాత్రం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వే నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు కావాలన్నవారి వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకునేవారి వివరాలను వడబోశారు. అన్ని అర్హతలు పరిశీలించిన తర్వాత 6,68,309 కుటుంబాలకు కొత్త కార్డులు అందజేయాలని నిర్ణయించారు.
గ్రామసభల అనంతరం కొత్త కార్డులు జారీ చేయనున్నారు. హైదరాబాద్( Hyderabad)లోనే అత్యధికంగా 83 వేల285 మంది అర్హులు ఉండగా...వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 6 వేల647 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Batti Vikramarka) సంతకాలతో కూడిన లేఖలనే కార్డులుగా అందజేస్తారు. కొంతకాలం తర్వాత పాతవారికి, కొత్తవారికి కలిపి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

