Chalo Medigadda: మార్చి 1 నుంచి చలో 'మేడిగడ్డ'కు బీఆర్ఎస్ పిలుపు - కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తామన్న కేటీఆర్
Telangana News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
BRS Called For Chalo Medigadda From March 1st: మార్చి 1 నుంచి 'చలో మేడిగడ్డ' (Chalo Medigadda) కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తామన్నారు. తెలంగాణ భవన్ నుంచి బస్సుల్లో కాళేశ్వరం వెళ్లి.. దశలవారీగా అన్ని చోట్లకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న అధికార కాంగ్రెస్ నేతలకు చూపిస్తామని స్పష్టం చేశారు. దశల వారీగా ప్రాజెక్టును సందర్శించి.. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు.
'కాంగ్రెస్ కుట్రలను ఎండగడతాం'
అధికార కాంగ్రెస్ మేడిగడ్డపై చేస్తున్న కుట్రను ఎండగడతామని కేటీఆర్ అన్నారు. 'కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసీ ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి. పాడైన బ్యారేజీలు మరమ్మతుకు ఇంజినీరింగ్ పరిష్కారాలు ఉన్నాయి. ఓ కాపర్ డ్యాం నిర్మాణం చేసి ఆ 3 పిల్లర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించవచ్చు. మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే.. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే మేం చెప్పాం. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలి. కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు నిర్వహించండి.' అని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వరదతో 3 బ్యారేజీలను కొట్టుకుపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా నేతలు డ్రామాలు ఆపి పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
'మేడిగడ్డ మాత్రమే కాదు'
కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలో మీటర్ల మేర కాలువలు, 98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత, 240 టీఎంసీల వినియోగం.. ఇలా అన్నింటి సమహారమే కాళేశ్వరం అని కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే అన్నట్లు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అందుకే కాళేశ్వరంలో పొంగిపొర్లుతున్న నీళ్లను ప్రజలకు చూపిస్తాం. దుష్ప్రచారం చేస్తున్న మేడిగడ్డకు కూడా మా పార్టీ ప్రతినిధి బృందం వెళ్తుంది. 40 లక్షల ఎకరాలకు నీరు అందించే కామదేనువు కాళేశ్వరం ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే కేసీఆర్ కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించింది. కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించాం.' అని పేర్కొన్నారు. ఆకలికేకల తెలంగాణ అన్నం గిన్నెగా మారిందని... దేశానికి అన్నపూర్ణగా రూపొందుకుందని అన్నారు. 'రైతులు 3 కోట్ల టన్నుల ధాన్యం పండించారు. ఎకరం రూ.3 లక్షలు ఉన్నది ఈ రోజు రూ.30 లక్షలైంది. ఇవన్నీ కాళేశ్వరం ద్వారా అందిన ప్రతి ఫలాలు కాదా.? అని ప్రశ్నించారు.
Also Read: Rahul Gandhi: తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ! - ఆ స్థానం నుంచే బరిలో దిగుతారా?