Rahul Gandhi: తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ! - ఆ స్థానం నుంచే బరిలో దిగుతారా?
Telangana News: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rahul Gandhi May Contested From Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్.. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. రాహుల్ గాందీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి. అటు, ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.
అక్కడి నుంచే బరిలో దిగుతారా.?
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇతర నేతలు కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని.. నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేయాలని సూచించినా.. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన్ను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయా నేతలతో సహా రాహుల్ కూడా అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ లోని అమేఠీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి. అటు, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
Also Read: Telangana LRS Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్, క్రమబద్ధీకరణకు ఛాన్స్