Jubilee Hills bypoll: మాగంటి సునీతను గెలిపించాలని జూబ్లిహిల్స్ ప్రజలు నిర్ణయించేసుకున్నారు - పార్టీ నేతలకు తెలిపిన కేసీఆర్
KCR: జూబ్లిహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమయిందని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఫామ్ హౌస్ లో జూబ్లిహిల్స్ క్యాడర్ తో సమావేశమయ్యారు.

BRS will win Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భారత్ రాష్ట్ర సమితి గెలుపు ఖాయమని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. "జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే మాగంటి సునీత గోపీనాథ్‌ను ఎన్నిక చేయాలని నిర్ణయించుకున్నారు" అని ఆయన అన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని తీవ్రంగా ఖండించారు. "హైదరాబాద్‌లోని చదువుకున్న, శాంతిప్రియ పౌరులకు ఇది అవమానం. ఇటువంటి రాజకీయాలను ఓటర్లు ఖండితంగా తిరస్కరిస్తారు. హైదరాబాద్ గౌరవం, చట్టబద్ధతను కాపాడతారు" అని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, మోసంతో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి వేగం పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీ నేతలకు ప్రతి ఇంటికీ వెళ్లాలని.. బాకీ కార్డును ప్రతి ఇంటికి చేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టాలని ఆదేశించారు. "సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలవాలి" అని లక్ష్యం నిర్దేశించారు. గ్రాస్‌రూట్ స్థాయిలో ప్రచారం ముమ్మరం చేయాలి..రాష్ట్ర ఆర్థిక స్థితి, అభివృద్ధి ఆగిపోవడం గురించి ప్రజలకు వివరించాలన్నారు. హైదరాబాద్ గౌరవం కాపాడాలని.. రౌడీషీటర్ రాజకీయాలను తిరస్కరించాలని ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి… pic.twitter.com/LrkTfujhXC
— BRS Party (@BRSparty) October 23, 2025
సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు , మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. నియోజకవర్గ డివిజన్లు, క్లస్టర్ల ఇన్‌చార్జులు, కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, అధినేత కేసీఆర్ గారు సమావేశంలో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధికార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు.
కేసీఆర్ ప్రచారానికి వస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.ఆయన తాను కూడా ప్రచారం చేస్తానని చెప్పకపోవడతో.. తెర వెనుక వ్యూహాలకే పరిమితమవుతారని.. క్లారిటీ వచ్చినట్లయింది.





















