Telangana: తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
Transport check posts: అవినీతికి అడ్డాగా మారిన ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్టులను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

Telangana Government orders removal of Transport check posts: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ చెక్‌పోస్టుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అక్టోబర్ 22న ఆదేశాలు వెలువడ్డాయి. గత ఆదివారం ఆంటీ కరప్షన్ బ్యూరో అధికారులు చెక్‌పోస్టులపై నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా అవినీతి బయటపడింది.
తక్షణం ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్టులను రద్దు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపా లను నిలిపివేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చెక్‌పోస్టులను మూసివేయడంతో పాటు, అక్కడి సిబ్బందిని ఇతర చోట్ల వినియోగించుకోవాలి. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (డీటీసీలు) , జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు (డీటీవోలు) తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెంటనే మూసివేత నివేదికలను పంపాలని ఆదేశాలు
చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బ్యారికేడ్లు, సిగ్నేజ్‌లను వెంటనే తొలగించాలి. ఇకపై అక్కడ ఎవరూ ఉండరాదు, సిబ్బందిని ఇతర శాఖలకు తరలించాలి. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలి. చెక్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను సమీప డీటీవో కార్యాలయాలకు తరలించాలి. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలి. మూసివేత ప్రక్రియపై సమగ్ర నివేదికను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి..అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశిచిది.
పెద్ద ఎత్తున అవినీతి కేంద్రాలుగా మారిన ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్టులు
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం అవినీతి ఆరోపణలు. గత ఆదివారం సంగారెడ్డి, కామారెడ్డి, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ వసూళ్లు, అవినీతి బయటపడ్డాయి. ఇంతకుముందు ఆగస్టు 28న ప్రభుత్వం చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ జీవో జారీ చేసినప్పటికీ, కొన్ని చోట్ల అవి ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ దాడులు రుజువు చేశాయి. ఇంతకుముందు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జీఎస్‌టీ అమలు తర్వాత చెక్‌పోస్టుల అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది.
ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఎత్తివేత
ఈ మూసివేతతో రాష్ట్రంలోని 14 బార్డర్ చెక్‌పోస్టులు పూర్తిగా తొలగిస్తారు. తాత్కాలిక పర్మిట్లు, ట్యాక్స్ చెల్లింపులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వాహన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసి, స్వచ్ఛంద ట్యాక్స్ చెల్లింపులు, పర్మిట్ జారీలను సులభతరం చేస్తారు. బార్డర్ జిల్లాల్లో 6 నెలల పాటు మొబైల్ స్క్వాడ్లు నడుపుతారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలతో ఈ-ఎన్‌ఫోర్స్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తారు.





















