Jubilee Hills KCR: జూబ్లిహిల్స్‌లో కేసీఆర్‌వి తెర వెనుక వ్యూహాలే - నేరుగా ప్రచారం లేనట్లే ?
Jubilee Hills By election: జూబ్లిహిల్స్ కేసీఆర్ ప్రచారం చేయకపోవచ్చునని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉపఎన్నికల్లో ప్రచారానికి కేసీఆర్ ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపించరు.

KCR may not campaign in Jubilee Hills: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక ప్రచారం జోరందుకోనుంది. అన్ని పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించాయి. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో స్టార్ క్యాంపెయినర్‌గా కేసీఆర్ పేరు ఉండటంతో ఆయన ప్రచారం చేస్తారా అన్న సందేహం అందరిలోనూ ప్రారంభమయింది. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతను కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారు. వారు కూడా కేసీఆర్ ను ప్రచారంలో పాల్గొనాలని కోరినట్లుగా తెలుస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం.. తెర వెనుక రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు లాంఛనమే
బీఆర్ఎస్ పార్టీలో ఒకటి నుంచి పది దాకా కేసీఆర్ ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతూంటారు. అందులో సందేహం లేదు. అలాంటి నేత మరి ఏదైనా ఎన్నిక జరిగితే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేకుండా ఎలా ఉంటారు. మొదటి పేరు ఆయనదే ఉంటుంది. జూబ్లిహిల్స్ లోనూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీ కి సమర్పించాలి కాబట్టి .. ఇచ్చారు. ఆ జాబితాలో కేసీఆర్ పేరు మొదటి స్థానంలో ఉండటం అంటే.. ఆయన ప్రచారానికి వస్తారని అర్థం కాదు. ఆయన ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినరే. ప్రచారానికి రావాలంటే రావొచ్చు..లేకపోతే లేదు.
సహజంగా ఉపఎన్నికల్లో ప్రచారం చేయని కేసీఆర్
ఉపఎన్నికలు ఒకప్పుడు బీఆర్ఎస్ రాజకీయ పార్టీ వ్యూహం. ఉపఎన్నికలతో సెంటిమెంట్ పెంచేవారు. అప్పట్లో ఉపఎన్నికల్లో తాడోపేడో అన్నట్లుగా ప్రచారం చేసేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయడం మానేశారు. పాలేరు, దుబ్బాక, హుజూరాబాద్ సహా చాలా స్థానాల్లో ఉపఎన్నికలు వచ్చినా ప్రచారం చేయలేదు. అయితే మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్క బహిరంగసభలో ప్రసంగించారు. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనాలని అనుకోవడం లేదు. కానీ తెర వెనుక మాత్రం తన వ్యూహాలను అమలు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఇంఛార్జ్లతో గురువారంభేటీకానున్న కేసీఆర్ వారికి స్పష్టమైన దిశానిర్దేసం చేయనున్నారు.
కేసీఆర్ బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్లుగా ఉండాలని బీఆర్ఎస్ ప్లాన్
కేసీఆర్ చాలా కాలంగా బయటకు రావడం లేదు. పార్టీ సిల్వర్ జూబ్లి బహిరంగసభలో ప్రసంగం తర్వాత ఆయన పూర్తిగా తెర వెనుక రాజకీయాలకే పరిమితమయ్యారు. కొన్నిపార్టీ పార్టీ నేతలతో సమావేశమై.. త్వరలో తాను రోడ్డుపైకి వస్తానని చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు బయటకు వస్తారన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే కేసీఆర్ వస్తే.. మొత్తం సీన్ మారిపోయేలా ఉండాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. అందుకే ఇప్పుడు జూబ్లిహిల్స్ లో ప్రచారం చేయకపోయినా ఏమీ కాదని అనుకుంటున్నారు.





















