Kumuram Bheem Jayanti: నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గోండు వీరుడు కొమురం భీం! 'జల్, జంగల్, జమీన్' స్ఫూర్తి!
Kumuram Bheem History: కొమురం భీం అంటే ఓ నిప్పు కణిక. 'జల్, జంగల్, జమీన్' అనే పొలికేక. నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గోండు వీరుడు. తెలంగాణ చరిత్రలో ఈ ఆదివాసీ బిడ్డ పోరాట గాథ ఓ మైలురాయి.

Kumuram Bheem Asifabad | కొమురం భీం అంటే ఓ నిప్పు కణిక. 'జల్, జంగల్, జమీన్' అనే పొలికేక. నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గోండు వీరుడు. తెలంగాణ చరిత్రలో ఈ ఆదివాసీ బిడ్డ పోరాట గాథ ఓ మైలురాయి. కొమురం భీం వీరమరణం ఎందరో వీరులకు స్ఫూర్తి. అలాంటి ధైర్యవంతుడైన ఆదివాసీ నాయకుడి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
అడవిలో పుట్టిన ఎర్రని సూరీడు కొమురం భీం
కొమురం భీం గోండు తెగకు చెందిన ఆదివాసీ నాయకుడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పిడికిలి ఎత్తి ఆయన చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. కొమురం భీం ప్రస్తుత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (నాటి ఆదిలాబాద్)లోని సంకెపల్లి అనే మారుమూల గిరిజన ప్రాంతంలో 1901, అక్టోబర్ 22వ తేదీన జన్మించారు. తండ్రి చిన్నూ, తల్లి సోంబారు. దట్టమైన అడవులు, కొండలు, సెలయేటి పరవళ్లతో కూడిన ప్రాంతంలో గోండు గిరిజన ఆచారాలు, సంప్రదాయాల మధ్య కొమురం భీం బాల్యం గడిచింది.
బాల్యంలోనే నిజాం పాలకులపై ఆగ్రహం
కొమురం భీంకు 15 ఏళ్ల వయసులోనే తీవ్ర విషాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అటవీ సిబ్బంది గిరిజనుల మీద దాడి చేయడంతో కొమురం భీం తండ్రి చిన్నూ మరణించారు. ఈ ఘటన చిన్నవాడైన కొమురం భీంను కలిచివేసింది. నిజాం పాలకుల అణిచివేతపై ఆనాడే ఆయన మనసులో వ్యతిరేక భావం పురుడుపోసుకుంది. ఈ విషాదం తర్వాత కొమురం భీం సర్థాపూర్ అనే గ్రామానికి వలస వెళ్లారు.
జల్ -జంగిల్-జమీన్ అని నినదించి, ఆదివాసీల
— మన మంచిర్యాల (@mncl_tweets) October 22, 2025
హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన
విప్లవ కెరటం కొమురం భీం జయంతి సందర్భంగా
వారి దివ్య స్మృతికి ఘన నివాళులు.#komarambheem pic.twitter.com/4lo0lWGomG
కొమురం భీం పోరాటానికి మూలం మూడు కారణాలు
కొమురం భీం చిన్నతనంలో నిజాం పాలనలో అటవీ శాఖ అధికారుల దాడిలో తన తండ్రిని కోల్పోయారు. అయితే అంతటితో నిజాం పాలకుల అణిచివేత ఆగలేదు. సర్థాపూర్ అనే గ్రామానికి వలస వెళ్లినా అక్కడ కూడా ఇదే అణిచివేత పరిస్థితులను కొమురం భీం కుటుంబం ఎదుర్కొంది.
1. భూ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం - ఆ గ్రామంలో భీం కుటుంబం సాగు చేసుకుంటున్న పోడు భూమిని సిద్దిఖీ అనే జాగీర్దార్ ఆక్రమించుకోడానికి ప్రయత్నించాడు. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భీం ఆ జాగీర్దార్ సిద్ధిఖీని అడవి గొడ్డలితో హతమార్చాడు. ఈ సంఘటన నిజాం పాలనపై గిరిజనులు చేసిన తొలి సాయుధ పోరాటంగా చరిత్రలో నిలిచింది. దీంతో నిజాం పోలీసులు భీం కోసం వెతకడం ప్రారంభించడంతో ఆయన అక్కడి నుండి అస్సాంకు పారిపోయాడు. ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ఆయుధ శిక్షణ తీసుకున్నాడు, రాజకీయ చైతన్యాన్ని సముపార్జించుకుని తిరిగి ఆదివాసీల హక్కుల కోసం పోరాడేందుకు సర్థాపూర్, కెరిమెరి ప్రాంతానికి తిరిగి వచ్చారు.
2. నిజాం పాలనలో 'పట్టి' (పన్నులు) దోపిడీ - ఆనాడు నిజాం ప్రభుత్వం గిరిజనులకు జీవనోపాధి ఇచ్చే ప్రతీ దానిపై పన్నులు ('పట్టి') విధించేది. పశువుల కాపరులపైన, అటవీ ఉత్పత్తులపైన, పోడు వ్యవసాయంపై భారీగా పన్నులు వసూలు చేసేవారు. పన్నులు కట్టకపోతే వారిని క్రూరంగా హింసించడం, దౌర్జన్యానికి దిగడం సర్వసాధారణం. అటవీ అధికారులు పన్నులు కట్టని వారి పిల్లల చేతిని కోయడం వంటి క్రూరత్వం భీంకు కోపాన్ని తెప్పించింది.
నిజాం ప్రభుత్వం గిరిజనుల జీవనాధారమైన ప్రతి అంశంపై అధిక పన్నులు ('పట్టి') విధించేది. పశువుల కాపర్లపై, అటవీ ఉత్పత్తులపై, చివరికి పోడు వ్యవసాయంపై కూడా భారీగా సుంకాలు వసూలు చేసేవారు. పన్నులు కట్టలేని వారిపై దౌర్జన్యాలు చేయడం, అటవీ అధికారులు పిల్లల చేతివేళ్లు కోసేయడం వంటి క్రూరత్వం భీంకు కోపాన్ని తెప్పించాయి.
3. 'జల్-జంగల్-జమీన్' - అస్తిత్వ పోరాటం అయితే ఈ పరిస్థితి మారాలంటే భూ ఆక్రమణలు, పన్నులకు వ్యతిరేకంగా పోరాటం మాత్రమే సరిపోదని కొమురం భీం అర్థం చేసుకున్నారు. దాంతో 'జల్ - జంగల్ - జమీన్' అనే నినాదం ఎత్తుకున్నారు. అస్తిత్వం, స్వయం పాలన కోసమే పోరాటం చేపట్టాలని నిర్ణయించారు. 'జల్' - అంటే మా నీరు, 'జంగల్' - మా అడవి, 'జమీన్' - మా భూమి. దీనిపై నిజాం పాలకులకు ఎలాంటి అధికారం లేదని, మా గూడెంలో - మా పాలన అంటూ పోరు బాట పట్టారు. జోడేఘాట్ కేంద్రంగా సుమారు 12 గూడేలలో కొమురం భీం స్వయం పాలన ప్రారంభించడం జరిగింది.
కుట్రకు బలై వీరమరణం పొందిన కొమురం భీం
స్వయం పాలన కోసం పిడికిలి ఎత్తిన కొమురం భీం గిరిజనులతో కలిసి పోరాడారు. తిరుగుబాటు ఉధృతమవుతుండటంతో నిజాం పాలకులు హైదరాబాద్ నుండి సాయుధ దళాలను పంపారు. వారిపై తనదైన గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో భీం పోరాటం జరిపారు. అయితే నమ్మకస్తుడైన కుర్దు పటేల్ అనే స్వంత అనుచరుడు నిజాం సైన్యానికి భీం స్థావరాన్ని చెప్పడంతో సైన్యం చుట్టుముట్టింది. 1940, అక్టోబర్ 27వ తేదీన ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి తిథి రోజున నిజాం సైన్యం జోడేఘాట్ అడవుల్లోని భీం స్థావరాన్ని అర్ధరాత్రి చుట్టుముట్టింది. ఈ పోరాటంలో నిజాం సైన్యం తుపాకీ కాల్పుల్లో భీం, ఆయన అనుచరులు తీవ్రంగా పోరాడి వీరమరణం పొందారు. అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం మరణించినా ఆయన నినాదం 'జల్ - జంగల్ - జమీన్' నేటికీ మారుమోగుతోంది. ఆదివాసీ హక్కులకు, అస్తిత్వ పోరాటాలకే కాదు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, రైతు ఉద్యమాల్లోనూ, చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఈ నినాదం చోటు చేసుకుంది. ఇది మరచిపోని వీరుడి చరిత్రకు నిదర్శనం.






















