Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !
Raja Singh : ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎదుట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోమని బీజేపీ ప్రకటించింది. పూర్తి స్థాయి స్పీకర్ ఎంపికయ్యాక ఆయన సమక్షంలో ప్రమాణం చేస్తామని చెబుతున్నారు.
Telangana BJP MLAs Oath Taking : శనివారం అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీపీ ఎంపికయ్యారు. లఅయితే ఆయన ఎదుట ప్రమాణం చేయబోమని బీజేపీ చెబుతోంది. కాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని రాజాసింగ్ ్రకటించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఎవరు దోస్త్, ఎవరు దుస్మన్ అర్థం అవుతుందా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎంకి ఇచ్చిన లెక్కనే.. కాంగ్రెస్ కూడా భయపడి తమ చెయ్యిని కూడా ఎంఐఎం చేతికి ఇస్తుందని రాజాసింగ్ తెలిపారు. ఎందరో సీనియర్లు ఉన్న ఆయనే ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న, బీఆర్ఎస్ ఉన్న, టీడీపీ ఉన్న రేపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కాళ్లు మొక్కి నెత్తి మీద కూర్చోడానికి ప్రయత్నిస్తారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి, టిల్లు అని ఆన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎందే రాజ్యం నడుస్తుందని రాజాసింగ్ విమర్శించారు. రాజాసింగ్ 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రొటెమ్ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పట్లో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించగా దేశం, ధర్మం పట్ల గౌరవం లేని పార్టీకి ఇచ్చారని ఆరోపించారు.
దీంతో ముంతాజ్ ఖాన్ సమక్షంలో కాకుండా పూర్తి స్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. శనివారమే స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టకి చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎన్నుకోనున్నారు. ఆయన ఎన్నికలయిన తర్వాత బీజేపీ సభ్యులు ఆయన సమక్షంలో ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించింది. రాజాసింగ్ మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మిగిలిన వాళ్లు అందరిలో ఒకరిద్దరు తప్ప అందరూ కొత్త వారే. నిర్మల్ మహేశ్వర్ రెడ్డి గతంలో పీఆర్పీ తరపున గెలిచారు.. ఇప్పుడు బీజేపీ తరపున గెలిచారు. మిగిలిన ఎమ్మెల్యేలు కొత్తవారు.
బీజేపీ శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్ ఉంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రాజాసింగ్ వివాదాస్పద నేత. ఆయనపై గతంలో బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఖరారు చేసిన రోజే తొలగించింది. ఆయన మళ్లీ గెలిచారు. ఆయనకు పదవి ఇస్తారో లేదో స్పష్టత లేదు కానీ.. ఆయనే బీజేపీ తరపున విధాన నిర్ణయాలు ప్రకటిస్తున్నారు.