Telangana Political Letters : బండి సంజయ్ వర్సెస్ నిరంజన్ రెడ్డి - రైతుల కష్టాలకు కారణం మీరంటే మీరని లేఖలు
రైతు సమస్యలపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర లేఖలు రాసుకుని విమర్శలు చేసుకుంటున్నాయి. రైతు బంధు నిధులు విడుదల చేయాలని బండి సంజయ్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెప్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డి పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.
Telangana Politica Letters : రైతుల సమస్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ లేఖతో పాటు కేంద్ర విధానాలను ప్రశ్నిస్తూ తెలంగాణ వ్యవసాయ మంత్రి మరో లేఖ రాశారు. ఇటీవలి కాలంలో బండి సంజయ్ వరుసగా లేఖలు రాస్తున్నారు. వాటికి అంతే ఘాటుగా టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు.
కేసీఆర్‌ను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా తేల్చిన బండి సంజయ్ !
8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రైతుల కంటకన్నీరు `కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరు` అంటూ బండి సంజయ్ .. మూడు పేజీల లేఖను కేసీఆర్‌కు పంపారు. కేంద్రప్రభుత్వంపైన, ప్రధానమంత్రి నరేంద్రమోడీపైన గోబల్స్ ప్రచారం చేయడం ఆపాలన్నారు. 14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ ఆయన బాటలో నడుస్తూ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని కేసీఆర్‌కు లేఖలో బండి సంజయ్ సూచించారు. రూ. 7500 కోట్లు రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, 2018 ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరారు.
రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలన్న బండి సంజయ్
రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించడంతో రైతాంగం పొలం పనులు ప్రారంభించారు, ఈ సమయంలోనే రైతులకు పెట్టుబడి సహాయం రైతుబంధు పథకం అవసరమని ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారం కోసం, మంత్రి కేటీఆర్ విదేశీపర్యటనకు నిధులుంటాయి తప్ప రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతుబంధుకు, రైతురుణమాఫీకి నిధులుండవాని అని ప్రశ్నించారు. రైతుబంధు పథకం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రయివేట్ వడ్డీ వ్యాపారస్థులపైన అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్‌సమ్మాన్ నిధి కింద కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణలో 5800 కోట్ల రూపాయల నిధులను జమచేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు.
బీజేపీది మొసలి కన్నీరని మండిపడ్డ నిరంజన్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత నాది .. రైతులు వరి వేయాలి అన్న బండి సంజయ్ ఆ తరువాత ముఖం చాటేశాడని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో యాసంగి వడ్లను కొనుగోలు చేశారన్నారు. రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బండి సంజయ్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కునేలకు రాయాలనిడిమాండ్ చేశారు. రైతుబంధుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది .. రూ.7500 కోట్లకు రూ.580 కోట్లకు తేడా ఎంతో బండి సంజయ్ ఎవరినన్నా లెక్కలడిగి తెలుసుకోవాలనిర సలహా ఇచ్చారు. కేంద్రం మద్దతుధరలు ప్రకటించిన 14 పంటలలో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగుచేసినా రైతులకు గిట్టుబాటు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్ ను విమర్శిస్తున్న బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేళ్లలో విదేశీ పర్యటనల ఖర్చు, ఆయన వేసుకునే సూటు, బూటులకు అయిన ఖర్చు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెచ్చుకుని చదువుకుంటే మంచిదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు లేఖ రాసే బదులు రూ. 30,000 కోట్ల పై చిలుకు కేంద్రం నుండి తెలంగాణా కు రావాల్సిన బాకాయిలు వెంటనే విడుదల చేయాలని దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని సవాల్ చేశారు.