Akkineni Nagarjuna: హీరో నాగార్జునకు ఊరట - ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే
Nagarjuna N Convention: హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
Akkineni Nagarjuna Petition In Highcourt On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు శనివారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంపై హీరో నాగార్జున ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై విచారించిన జస్టిస్ టి.వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ జరిగింది
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ఎన్ కన్వెన్షన్ హాల్‌ను హైడ్రా (HYDRA - హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) భారీ బందోబస్తు మధ్య శనివారం ఉదయం కూల్చివేసింది. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు అందడంతో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. కాగా, హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన కన్వెన్షన్ సెంటర్స్‌లో N కన్వెన్షన్ ఒకటి. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ నెల 21న లేఖ రాశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా N కన్వెన్షన్‌కు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. కూల్చివేతకు ముందే యజమానికి హైడ్రా నోటీసులు పంపించింది.
స్పందించిన నాగార్జున
మరోవైపు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున స్పందించారు. హైడ్రా చర్యలు చట్ట విరుద్ధమని.. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అన్నారు. పూర్తిగా పట్టా భూమిలో ఆ నిర్మాణం ఉందని.. ఒక్క ఇంచ్‌కూా చెరువు ప్లాన్‌కు విరుద్ధంగా లేదన్నారు. 'ఆ భూమి పట్టా భూమి. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా జరిగింది. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కేసు కోర్టులో ఉండగా ఇలా చేయడం సరికాదు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే నేనే కూల్చివేతలు చేపట్టేవాడిని. తాజా పరిణామాలతో మేం అక్రమాలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. దీనిపై న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మేం ఆశిస్తున్నాం.' అని ట్వీట్ చేశారు.
స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024