Revanth Meet Rahul: రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ - ఆ అంశాలపై క్లారిటీ వచ్చినట్లే !
Telangana: చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో సమావేశమయ్యారు. రేవంత్ కు రాహుల్ సమయం ఇవ్వడం లేదని జరుగుతున్న ప్రచారానికి ఈ భేటీతో చెక్ పెట్టినట్లయింది.

Revanth Reddy met Rahul: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టెన్ జన్‌పథ్ నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్ తో భేటీ కోసం చాలా రోజులుగా చూస్తున్న రేవంత్ రెడ్డికి.. సమయం కేటాయించడంతో ఢిల్లీ వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను.. కులగణన ఫలితాలను వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ అంశాపైనా వివరించారు. ఈ రెండు అంశాల ఆధారంగా తెలంగాణలో రెండు బహిరంగసభలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని.. వాటికి హాజరు కావాలని రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. రాహుల్ అందుబాటును బట్టి సభల తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు.
కులగణన, వర్గీకరణలపై రెండు బహిరంగసభలు
కులగణన సభను గద్వాలలో.. ఎస్సీ వర్గీకరణ సభకు సూర్యాపేటలో నిర్వహించాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలు సందర్భాలలో బహిరంగసభలు ఏర్పాటు చేసి.. రాహుల్ లేదా ప్రియాంకలను అహ్వానించాలనుకున్నపప్పటికీ సాధ్యం కాలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించాలనుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో సోనియా హాజరు కాలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణను ప్రభుత్వం పూర్తి చేసినందున ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు రాహుల్ ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నారు. రాహుల్ కూడా తాను వస్తానని అభయం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి చెక్ పెట్టిన రేవంత్
మరో వైపు రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కాలేదు. చాలా సార్లు రేవంత్ రెడ్డి ..ఢిల్లీకి వెళ్లినప్పటికీ రాహుల్ గాంధీని కలవలేదు. అదానీతో రేవంత్ రెడ్డి మరీ సన్నిహితంగా ఉంటున్నారన్న కారణంగా రాహుల్ అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం ఏఐసీసీ వర్గాల్లో ఉంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అలాంటిదేమీ లేదని తానే రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ అడగలేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి భేటీతో ... రెండు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తేలిపోయిందన్న సంకేతాలు రాజకీయ వర్గాలకు పంపినట్లు అవుతుంది. రాహుల్ గాందీ ఇటీవల వరంగల్ పర్యటనకు రావాలనుకున్నారు. అయితే ఆయన పర్యటన ఎంత వేగంగా ఖరారు అయిందో అంతే వేగంగా రద్దు అయింది.
మంత్రివర్గ విస్తరణకు కూడా అనుమతి తీసుకున్నారా ?
రేవంత్ రెడ్డి పలు పార్టీ పరమైన అంశాలను కూడా రాహుల్ గాంధీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యవర్గం ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా దీపాదాస్ మున్షీని తప్పించి.. మీనాక్షి నటరాజన్ ను నియమించిన రోజునే.. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వడం కీలకంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

