Sridhar Babu: హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనున్న రష్యా దిగ్గజ కంపెనీ
Telugu News: డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యా కు చెందిన ఏఈసీ ల్యాబ్ జూమ్ టెక్నాలజీస్ కంపెనీ తో కలిసి హైదరాబాదులో ఫోరెన్సిక్ సెంటర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ACE Lab to set up Forensic Center in Hyderabad: హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక సదస్సుతో తెలంగాణలో దాదాపు 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా తెలంగాణ (Telangana)లో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యా కు చెందిన ఏఈసీ ల్యాబ్ జూమ్ టెక్నాలజీస్ కంపెనీ తో కలిసి హైదరాబాదులో ఫోరెన్సిక్ సెంటర్ (Forensic Center) అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఏసీఈ లాబ్ సీఓఓ మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీఓఓ, ఆ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.
తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలపై మంత్రికి వివరించారు. ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాల గురించి వారు చర్చించారు. 129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన సాంకేతిక నిపుణులతో ఆయా సంస్థలకు తాము వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణార్ధులమని తెలిపారు.
తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన తోడ్పాటును అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వారికి హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆ సంస్థ యూనిట్ ను ఏర్పాటు చేయడాన్ని మంత్రి స్వాగతించారు.
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన టిబెటన్ ప్రతినిధులు
టిబిటన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్ ప్రతినిధులు మంగళవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు. టిబెట్ కు సార్వభౌమాధికారాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గారిని కలిసిన వారిలో మాంక్ గేశే అతుక్ సెతాన్, ఎంపీ సెరింగ్ యంఘ్చెన్, దొండప్ తాషి తదితరులు ఉన్నారు.