Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
Redmi Affordable 5G Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో తన చవకైన 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే రెడ్‌మీ ఏ4 5జీ. దీని ధర రూ.10 వేలలోపే ఉండవచ్చని తెలుస్తోంది.
Redmi A4 5G Launch Date: రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్ ఫోన్‌ను మొట్టమొదట ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024 ఈవెంట్‌లో ప్రదర్శించారు. అక్టోబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. ఈ ఫోన్ రూ.10 వేలలోపు ధరతోనే లాంచ్ కానుందని కంపెనీ ఇది వరకే ప్రకటించింది. ఇప్పుడు దీని లాంచ్ తేదీని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్‌లోని కీలక స్పెసిఫికేషన్లు, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్ ఎప్పుడు?
రెడ్‌మీ ఏ4 5జీ మనదేశంలో నవంబర్ 20వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా అమెజాన్‌లో లైవ్ అయింది. దీన్ని బట్టి ఈ ఫోన్ సేల్ అక్టోబర్‌లో జరగనుందని అనుకోవచ్చు.
రెడ్‌మీ ఏ4 5జీ ఫీచర్లు, డిజైన్ ఎలా ఉంటాయి? (Redmi A4 5G Features)
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ప్రపంచంలోనే ఈ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదేనని తెలుస్తోంది. దీని అధికారిక మైక్రోసైట్ ప్రకారం ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్‌గా ఉంది.
Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు. ఫోన్ వెనకవైపు వృత్తాకారంలో కెమెరా సెటప్ కనిపించింది. డ్యూయల్ టోన్ ఫినిష్‌తో రెడ్‌మీ ఏ4 5జీ మార్కెట్లోకి రానుంది. దీనికి శాండ్‌విచ్ డిజైన్ అని కంపెనీ పేరు పెట్టింది.
రెడ్‌మీ ఏ4 5జీ స్మార్ట్ ఫోన్‌లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. గతంలో వచ్చిన లీకుల ప్రకారం ఇందులో 18W వైర్డ్ ఛార్జింగ్ అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఇది రన్ కానుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉంది.
రెడ్‌మీ ఏ4 5జీ ధర ఎంత ఉండవచ్చు? (Redmi A4 5G Price in India)
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండవచ్చని తెలుస్తోంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ ఫోన్ ధర రూ.8,499గా ఉండనుందని లీకులు వస్తున్నాయి. దీంతోపాటు ఈ ఫోన్‌పై పలు బ్యాంక్ ఆఫర్లు, లాంచ్ ఆఫర్లు కూడా లభించనున్నాయి. ఈ ఫోన్ లాంచ్ అయ్యాక దీనికి ఎంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!