YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Jagan : మొదటి నుంచి తనతో నడిచిన వాళ్లు కూడా జగన్ ను వదిలేసి వెళ్లిపోతున్నారు. జగన్ వారికి భవిష్యత్ పై నమ్మకం కలిగించలేకపోతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది ?
Ysrcp Leaders Leaving Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి కలిసి నడుస్తున్న నేతలు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆయన పార్టీ పరిస్థితిపై సంచలన ఆరోపణలు చేయబోతున్నారు. జగన్ కోసం మొదట్లో రాజీనామా చేసిన నేత మాత్రమే కాదు.. జగన్ సమీప బంధువు కూడా. అయనను కూడా జగన్ తో పాటు కలిసి నడిచేలా ఉంచుకోలేకపోతున్నారు. మరి ఇతర నేతలు ఎలా ఉంటారు ?. వైఎస్‌ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?
ఓటమితో మారిపోయిన వైసీపీ ఫేట్
ఒక్క దారుణ పరాజయం తర్వాత వైసీపీ ఫేట్ ఒక్క సారిగా మారిపోయింది. అతి భారీ మెజార్టీలతో ఓడిపోవడంతో భవిష్యత్ ఉంటుందా లేదా అన్న గందరగోళంతో పాటు జగన్ వ్యవహారశైలి వల్ల ఇబ్బంది పడిన వారంతా.. మెల్లగా వేరే దారి చూసుకుంటున్నారు. నిజానికి ఇంకా ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ వంటి కార్యక్రమాలు చేపట్టలేదు. వైసీపీలో ఉక్కపోత భరించలేని వాళ్లు.. భవిష్యత్ పై భయం ఉన్న వాళ్లు మెల్లగా సర్దుకుని కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అంతే. ఆయన ఓటమి తర్వాత కూడా.. వైసీపీ పాలసీ అయిన ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడారు. కోర్టుల్లో కేసులు వేశారు . అయితే గుర్తించడానికి.. గుర్తింపు ఇవ్వడానికి జగన్ సిద్ధంపడలేదు. చివరికి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, జగన్ హయాంలో అన్నీ అరాచకాలే - చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
నమ్మకస్తులను ఎందుకు దూరం చేసుకుంటున్నారు ?
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వైసీపీలో అందలం ఎవరికి దక్కింది అంటే.. బొత్స సత్యనారాయణ సహా ఇతర సీనియర్లకు దక్కింది. వీరిలో చాలా మంది జగన్ తో పాటు నడవలేదు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ లేదని తేలిన తర్వాతే జగన్ వద్దకు వచ్చారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు జగన్ పై ఎన్నో విమర్శలు చేశారు.మాజీ మంత్రి కన్నబాబు కూడా అంతే. ఇలాంటి వారందరికీ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రయారిటీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనతో పాటు నడిచినచాలా మందిని పక్నక పెట్టేశారు. కొంత మంది ఎన్నికలకు ముందే పార్టీ మారిపోగా.. జగన్ ను విడిచి పెట్టలేక ఎన్నో అవమానాలు ఎదుర్కొని అయినా పార్టీలోనే కొనసాగుతున్న బాలినేని వంటి వాళ్లు ఇప్పుడు దండం పెట్టేస్తున్నారు. ఇప్పుడు జగన్ ఎవర్ని నమ్ముతున్నారు అంటే.. బొత్స, చెవిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారినే. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం శ్రమించిన షర్మిల ఎప్పుడో దూరమయ్యారు.
గతంలో చేసిన పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం సాఫీగా సాగే అవకాశం లేదు. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులు లాగే వివేకా హత్య కేసులోనూ ఆయనకు చిక్కులు తప్పవు. గత ప్రభుత్వ అవినీతి అంశంలో.. ఇప్పటికే మద్యం, ఇసుక , మైనింగ్ వంటి చోట్ల పెద్ద ఎత్తున కేసులు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇలాంటి పరిణామాలతో జగన్ మోహన్ రెడ్డి.. అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్గోబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనతో పాటు నడిస్తే తాము మునిగిపోతామని అనుకుంటే.. ఎక్కువ మంది గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. జగన్మోహన్ రెడ్డి తనతో మొదటి నుంచి నడిచిన సీనియర్ నేతల్ని కూడా తనతో పాటు ఉంచుకోలేకపోతే ఆయనకు తీరని నష్టం జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.